KTR: కవితక్క కూడా వస్తారు... అండగా ఉంటారు: కేటీఆర్

KTR promises Jagityal BRS leaders

  • జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారన్న కేటీఆర్
  • పార్టీ మారిన సంజయ్‌ని వెంటబడి మరీ ఓడిద్దామని పిలుపు
  • రేవంత్ రెడ్డి మొగోడైతే పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్
  • రేవంత్ రెడ్డి ఆరోజు ప్రభుత్నాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారని ఆగ్రహం
  • పార్టీ ఫిరాయింపులను ప్రారంభించిందే కాంగ్రెస్ అన్న కేటీఆర్

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని... కానీ ఇక్కడి కార్యకర్తలకు తాము అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జగిత్యాలలో తాను గల్లీ గల్లీ తిరుగుతానని హామీ ఇచ్చారు. కవితక్క కూడా వస్తారని అండగా ఉంటారన్నారు. జ‌గిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ స‌మావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ... రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్‌ని వెంటబడి మరీ ఓడిద్దామని పిలుపునిచ్చారు. ఆయన బండ కట్టుకొని బావిలో దూకాడని... కానీ మనం ధైర్యంగా ముందుకు సాగుదామని కార్యకర్తలకు సూచించారు.

నీవు మొగోడివి అయితే.. ఆ ఆరుగురు ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి ఎన్నిక‌ల‌కు రా… ఓట్లతో కొట్టి ఆ ఆరుగురిని శాశ్వతంగా రాజ‌కీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. రోషం, ద‌మ్ముంటే ప‌ద‌వికి రాజీనామా చేసి ప్ర‌జ‌ల్లోకి రావాలన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను చేర్చుకున్నాం క‌దా అని కొంద‌రు అంటున్నారని... మ‌న‌కు, వాళ్ల‌కు తేడా ఏమిటో తెలియాలన్నారు. పార్టీ ఫిరాయింపులకు తొలుత పాల్పడింది కాంగ్రెస్సే అన్నారు. ఆయారాం.. గ‌యారాం.. విష‌బీజానికి మొగ్గ తొడిగింది ఇందిరాగాంధీ హయాంలోనే అని విమర్శించారు. నాడు హ‌ర్యానాలో ఇత‌ర పార్టీల‌ ఎమ్మెల్యేల‌ను లాక్కొని... పార్టీ ఫిరాయింపుల సంస్కృతి తీసుకువచ్చారని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి ఆరోజు ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు

2004లో బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని గెలిచిందని, తమ పార్టీ నుంచి 26 మంది గెలిస్తే నాటి వైఎస్ ప్రభుత్వం 10 మందిని తమలో కలుపుకునే ప్రయత్నం చేసిందన్నారు. కాంగ్రెస్ మెడలు వంచి 2014లో కేసీఆర్ తెలంగాణ సాధించారని... అయితే  నాడు రేవంత్ రెడ్డి రూ.50 లక్షలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తూ అడ్డంగా దొరికిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేయడంతో... ఆ తర్వాత టీడీపీ, బీఎస్పీ నుంచి మూడింట రెండొంతుల ఎమ్మెల్యేలు వచ్చి బీఆర్ఎస్‌లో విలీనమయ్యారని తెలిపారు. అప్పుడు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కలేదన్నారు.

ఇప్పుడు ఆ పిచ్చి కుక్క ఎవరు?

పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డే ఎమ్మెల్యేల‌ను కుక్క‌ల మాదిరి రాళ్ల‌తో కొట్టి చంపాల‌ని రేవంత్ రెడ్డి గ‌తంలో అన్నారని... ఇప్పుడు ఆ పిచ్చికుక్క ఎవరు? అని ప్రశ్నించారు. అలాంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలన్నారు. రేవంత్ రెడ్డికి ద‌మ్ముంటే తీసుకున్న ఆరుగురు ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి ఎన్నిక‌ల‌కు రావాలని సవాల్ చేశారు. ఓట్ల‌తో కొట్టి ఆ ఆరుగురిని రాజ‌కీయంగా శ్వాశ‌తంగా స‌మాధి చేసే బాధ్య‌త తెలంగాణ స‌మాజం తీసుకుంటుందన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఆటోమేటిక్‌గా డిస్‌క్వాలిఫై చేస్తామని రాహుల్ గాంధీ అన్నారని... కానీ ఆ మాటను విస్మరించారన్నారు.

More Telugu News