Pani Puri: పానీపూరీ తింటున్నారా?.. అయితే, ముందుగా ఇది చదవండి!

Cancer causing chemicals found in Pani Puris at Karnataka
  • పానీపూరీలో క్యాన్సర్ కారకాలు
  • కర్ణాటకలో పానీపూరీ బండ్ల నుంచి నమూనాల సేకరణ
  • మనుషులు తినడానికి కొన్ని పనికిరావని తేల్చిన వైనం
  • చాలావాటిలో అనారోగ్యానికి కారణమయ్యే కృత్రిమ రంగులు
పానీపూరీ.. దీనికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతిచోటా కనిపించే ఈ బండి వద్ద ఎప్పుడు చూసినా జనం బారులు తీరుతూ కనిపిస్తారు. ఎంతో రుచిగా ఉండే ఈ పానీపూరి ఆరోగ్యాన్ని కూడా అంతగానే దెబ్బతీస్తుందని, దీంట్లో కేన్సర్ కారకాలు ఉన్నాయని తాజాగా బయటపడింది. కర్ణాటకలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం వెలుగు చూసింది. 

వారు సేకరించిన పానీపూరీ నమూనాల్లో 22శాతం ఆరోగ్య ప్రమాణాలకు దూరంగా ఉన్నట్టు గుర్తించారు. మొత్తం 260 శాంపిళ్లు సేకరించగా వాటిలో 41 నమూనాల్లో కేన్సర్‌కు కారణమయ్యే కృత్రిమ రంగులు, కార్సినోజెనిక్ ఏజెంట్లు ఉన్నట్టు గుర్తించారు. మరో 18 శాంపిళ్లు అసలు మనుషులు తినడానికే పనికిరావని తేల్చాయి. 

పానీపూరీ నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా రోడ్లుపక్కన స్టాళ్లలో విక్రయించే శాంపిళ్లు సేకరించి పరీక్షించినట్టు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కె.శ్రీనివాస్ తెలిపారు. వాటిలో చాలా వరకు మనుషులు తినడానికి కూడా పనికిరానివి ఉన్నాయని తెలిపారు. అనారోగ్యానికి కారణమయ్యే బ్రిలియంట్ బ్లూ, సన్‌సెట్ యెల్లో, టార్టాజైన్ వంటి రసాయనాలను పానీపూరీ శాంపిళ్లలో గుర్తించినట్టు వివరించారు. 

కర్ణాటక ప్రభుత్వం ఇటీవల గోబీ మంచూరియా, కాటన్ క్యాండీ వంటి వాటిలో ఉపయోగించే రంగులను నిషేధించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావు హెచ్చరించారు.
Pani Puri
Karnataka
Chemicals
Cancer

More Telugu News