Rohit Sharma: ఇది చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం.. రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ

Rohit sharma on his retirement

  • తనకు మొదట ఆ ఉద్దేశం లేదని తెలిపిన రోహిత్ 
  • ప్రపంచకప్ గెలిచాక వీడ్కోలు పలకడం సబబనిపించిందని వ్యాఖ్య
  • ఈ గెలుపుతో వచ్చిన ఆనందం మాటల్లో వర్ణించలేనన్న రోహిత్

అంతర్జాతీయ టీ20కి రిటైర్మెంట్ ప్రకటించాలని తాను ముందుగా అనుకోలేదని టీమిండియా రథసారధి రోహిత్ శర్మ తెలిపాడు. ‘‘రిటైర్ అవ్వాలని నేను అస్సలు అనుకోలేదు. అసలు నాకా ఉద్దేశమే లేదు. కానీ పరిస్థితి కలిసి వచ్చింది. కాబట్టి, రిటైర్మెంట్ ప్రకటించాను. ప్రపంచకప్ గెలిచాక కెరీర్‌కు వీడ్కోలు పలకడం కంటే మించినది ఏదీ ఉండదు’’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. 

రోహిత్‌తో పాటు మరో దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. గతేడాది వన్డే ప్రపంచకప్ చివరి నిమిషంలో భారత్‌ చేజారింది. వరుస విజయాలతో టోర్నీలో దూసుకుపోయిన టీమిండియా ఫైనల్స్‌లో తడబాటుకు లోనైంది. చివరకు ఆస్ట్రేలియా కప్ ఎగరేసుకుపోయింది. అంతకుముందు జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో కూడా టీమిండియాకు నిరాశే మిగిలింది. సెమీఫైనల్స్‌లోనే టీమిండియా ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. చివరకు ఇంగ్లండ్ ఆ టోర్నీలో విశ్వవిజేతగా నిలిచింది. 

ఇక రోహిత్ శర్మ తన టీ20 కెరీర్‌లో 159 మ్యాచుల్లో మొత్తం 4,231 పరుగులు చేశాడు. 5 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు సాధించాడు. అయితే, టెస్టులు, వన్డేల్లో మాత్రం రోహిత్ కొనసాగుతున్నాడు. కాగా, రోహిత్ శర్మ రిటైర్మెంట్ నేపథ్యంలో టీ20 సారథి రేసులో హార్దిక్ పాండ్యా ముందు వరుసలో ఉన్నాడు. గతేడాది రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ టీమిండియాను ముందుండి నడిపించాడు.

Rohit Sharma
T20 World Cup 2024
Retirement

More Telugu News