Ravindra Jadeja: కోహ్లీ, రోహిత్ శర్మ బాటలోనే రవీంద్ర జడేజా... టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్

Ravindra Jadesja announces retirement to T20 Internationals
  • 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా
  • ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
  • వారి బాటలోనే నేడు టీ20లకు వీడ్కోలు పలికిన జడేజా

ఎన్నాళ్లో వేచిన విజయం నిన్న టీమిండియాకు సాకారమైంది. 17 ఏళ్ల తర్వాత ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత క్రికెట్ జట్టు విజేతగా అవతరించింది. తమ కల నెరవేరడంతో టీమిండియా సీనియర్ క్రికెటర్లు ఒక్కొక్కరుగా అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నారు.  

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20 పోటీలకు రిటైర్మెంట్ ప్రకటించగా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా వారి బాటలోనే నడిచాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు నేడు ఇన్ స్టాగ్రామ్ లో ప్రకటించాడు. 

పూర్తిగా సంతృప్తి చెందిన హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నానని జడేజా వెల్లడించాడు. ఉరకలు వేసే అశ్వంలా దేశం కోసం ఎల్లప్పుడూ అత్యుత్తమ సేవలు అందించానని తెలిపాడు. ఇకపైనా ఇదే స్ఫూర్తితో ఇతర ఫార్మాట్లలో సేవలు అందిస్తానని జడేజా పేర్కొన్నాడు. టీ20 వరల్డ్ కప్ నెగ్గడం ద్వారా కల నెరవేరిందని, ఈ విజయం తన అంతర్జాతీయ కెరీర్ కు పరాకాష్ఠ అని అభిప్రాయపడ్డాడు. 

తన కెరీర్ లో ఎన్నో మధుర జ్ఞాపకాలు, ఉల్లాసభరిత క్షణాలు ఉన్నాయని, అచంచలమైన మద్దతు అందుకున్నానని, అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని జడేజా తన రిటైర్మెంట్ సందేశంలో వెల్లడించాడు. 

35 ఏళ్ల జడేజా తన కెరీర్ లో ఇప్పటివరకు 74 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడి 515 పరుగులు, 54 వికెట్లు సాధించాడు.

  • Loading...

More Telugu News