Ayodhya Ram Mandir: వర్షానికి అయోధ్యలో దారుణ పరిస్థితులు.. రూ. 311 కోట్లతో నిర్మించిన ‘రామ్‌పథ్’‌పై భారీ గోతులు

Potholes On Ram Path And Leakage In Ayodhya Temple
  • వర్షాలతో అయోధ్య అతలాకుతలం
  • రూ. 311 కోట్లతో 14 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం
  • ఆలయానికి అరకిలోమీటరు, కిలోమీటరున్నర దూరంలో మూడు భారీ గోతులు
  • ఆరుగురు మున్సిపల్ అధికారులపై యోగి ప్రభుత్వం వేటు

వర్షాలకు అయోధ్య అతలాకుతలం అవుతోంది. కొద్దిపాటి వర్షానికే రామాలయం గర్భగుడిలోకి నీళ్లు రాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అయోధ్య దాదాపు నీట మునిగినంత పనైంది. వీధులు కాలువలను తలపించాయి. రామాలయానికి వెళ్లేందుకు భక్తులు నానా అవస్థలు పడ్డారు. మోకాలి లోతు నీరు, బురదలో అష్టకష్టాలు ఎదుర్కొన్నారు.

తాజాగా, రూ. 311 కోట్ల వ్యయంతో నిర్మించిన ‘రామ్‌పథ్’ కుంగిపోయింది. రామమందిరానికి దారితీసే 14 కిలోమీటర్ల రోడ్డు ఆలయ గేటుకు అర కిలోమీటరు దూరంలో మీటరు వ్యాసార్థంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆలయానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో 6 మీటర్ల వ్యాసార్థంతో మరో రెండు గోతులు ఏర్పడ్డాయి. అయోధ్యధామ్ రైల్వే స్టేషన్‌లో నిర్మించిన 40 మీటర్ల పొడవైన ప్రహరీ కుప్పకూలింది. రోడ్లు కుంగిపోయి, వీధులు అస్తవ్యస్తంగా మారడంతో రంగంలోకి దిగిన అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. దీనిపై యోగి ప్రభుత్వం సీరియస్ అయింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరుగురు మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేసింది.

  • Loading...

More Telugu News