ISS: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని కూల్చేసేందుకు ఎలాన్ మస్క్‌కు కాంట్రాక్ట్

SpaceX wins 843 million dollars contract from NASA to bring ISS down to its watery graveyard
  • 2030 కల్లా ఐఎస్ఎస్ జీవితకాలం ముగింపు
  • ఐఎస్ఎస్‌ను కూల్చే కాంట్రాక్ట్ ను ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేఎక్స్‌కు అప్పగింత
  • ఈ దిశగా వ్యోమనౌకను నిర్మించనున్న స్పేస్ఎక్స్
  • వ్యోమనౌక సాయంతో ఐఎస్ఎస్‌ను కక్ష్య తగ్గించి సముద్రంలో కూల్చేందుకు ప్రణాళిక

సుదీర్ఘకాలం సేవలందించిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) కాలపరిమితి మరో ఆరేళ్లల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఐఎస్ఎస్‌‌ను నియంత్రిత విధానంలో సముద్రంలో కూల్చేసే కాంట్రాక్ట్ ను టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ దక్కించుకున్నారు. ఇందు కోసం మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ ఓ వ్యోమనౌకను నిర్మించనుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్‌ ఐఎస్ఎస్ కక్ష్యను క్రమంగా తగ్గించి చివరకు సముద్రంలో కూలిపోయేలా చేస్తారు. ఈ కాంట్రాక్ట్ విలువ దాదాపు 843 డాలర్లని సమాచారం (రూ. 7 వేల కోట్లు). 

అంతరిక్షంలో మానవులు నివాసం ఉండి, పలు రకాల పరిశోధనలు చేసేందుకు వీలుగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా, ఐరోపా, జపాన్, కెనడా, రష్యా కలిసి దీన్ని నిర్మించాయి. అంతరిక్షంలో అతిపెద్ద మానవ నిర్మిత కట్టడంగా ఐఎస్ఎస్ రికార్డు సాధించింది. విడతల వారీగా దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు. 1998లో దీని తొలి దశ ప్రారంభమైంది. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న క్షక్ష్యలో ఐఎస్ఎస్ పరిభ్రమిస్తోంది. సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఐఎస్ఎస్ జీవితకాలం ముగింపు దశకు చేరుకుంది. తరచూ ఐఎస్ఎస్ లో గ్యాస్ లీకులు, ఇతర సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో తొలగించేందుకు నాసా నిర్ణయించింది. ఐఎస్ఎస్‌కు సంబంధించి రష్యా నిర్వహణ కాంట్రాక్ట్ 2028లో ముగిసిపోనుండగా అమెరికా ఇతర దేశాలు మాత్రం 2030 వరకూ నిర్వహణను చేపడతాయి. 

ఐఎస్ఎస్‌ను కూల్చేది ఇలా..
నాసా శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, ఐఎస్ఎస్ కూల్చివేత మూడు దశల్లో జరగనుంది. తొలి దశలో ఐఎస్ఎస్‌లోని ఉష్ణోగ్రతను నియంత్రించే సౌర ఫలకాలు, రేడియేటర్లను వేరు చేస్తారు. రెండో దశలో అంతరిక్ష కేంద్రానికి వెన్నెముక లాంటి ట్రస్ నుంచి ఇతర భాగాలను విడదీస్తారు. మూడో దశలో ఐఎస్ఎస్‌ క్షక్ష్యను క్రమంగా కుదిస్తూ భూవాతావరణంలోకి అత్యధిక వేగంతో ప్రవేశించేలా చేస్తారు. ఈ క్రమంలో తీవ్రమైన ఉష్ణం జనించి ఐఎస్ఎస్‌లో పలు భాగాలు ఆకాశంలో మండిబూడిదైపోతాయి. మిగిలిన వాటిని మాత్రం పసిఫిక్ మహాసముద్రంలో కూలేలా వాటి గమనాన్ని నిర్దేశిస్తారు. గతంలో స్కైలాబ్, మిర్ అంతరిక్ష కేంద్రాల కూల్చివేత ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ ప్రణాళికను రూపొందించారు. ఇప్పటికే అనేక ఉపగ్రహాలను పసిఫిక్ మహాసముద్రంలోనే జల సమాధి చేశారు. దీంతో, ఈ సంద్రానికి వ్యోమనౌకల శ్మశానంగా పేరు స్థిరపడింది. 

  • Loading...

More Telugu News