T20 World Cup 2024: కాసేపట్లో టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య వరల్డ్ కప్ ఫైనల్... ఓసారి గణాంకాలు చూస్తే...!

Team India takes of South Africa in T20 World Cup final shortly
  • జూన్ 1 నుంచి ఉర్రూతలూగిస్తున్న టీ20 వరల్డ్ కప్
  • నేడు టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్
  • బ్రిడ్జిటౌన్ లోని కెన్సింగ్ టన్ ఓవల్ లో మెగా ఫైట్
  • రికార్డులన్నీ భారత్ కే అనుకూలం
  • వరల్డ్ కప్ లో తొలిసారి ఫైనల్ చేరిన సఫారీలు

గత నాలుగు వారాలుగా క్రికెట్ ప్రియులను అలరించిన టీ20 వరల్డ్ కప్ లో నేడు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు టైటిల్ కోసం చావోరేవో తేల్చుకోనున్నాయి. ఈ మహా సంగ్రామానికి బార్బడోస్ లోని కెన్సింగ్ టన్ ఓవల్ (బ్రిడ్జిటౌన్) వేదికగా నిలవనుంది. కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 

ఈ నేపథ్యంలో, ఓసారి గణాంకాలు పరిశీలిస్తే... టీమిండియాదే పైచేయిగా కనిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఫైనల్ చేరడం టీమిండియాకు ఇది మూడోసారి. 2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా... 2014లో ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. మళ్లీ ఇప్పుడు 2024లో ఫైనల్ చేరింది. 

అటు, దక్షిణాఫ్రికా జట్టుకు ఏ ఫార్మాట్ లో అయినా వరల్డ్ కప్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. ఈ టోర్నీలో టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు అజేయంగా ఫైనల్ చేరుకున్నాయి. లీగ్ దశలోనూ, సూపర్-8 దశలోనూ రెండు జట్లకు ఒక్క ఓటమి కూడా ఎదురుకాలేదు.

ఇక టీ20ల్లో టీమిండియా, దక్షిణాఫ్రికా పరస్పరం 25 మ్యాచ్ ల్లో తలపడగా... టీమిండియా 14, దక్షిణాఫ్రికా 11 మ్యాచ్ ల్లో నెగ్గాయి. టీ20 వరల్డ్ కప్ టోర్నీలలో టీమిండియా 6 సార్లు దక్షిణాఫ్రికాతో ఆడగా... 4 మ్యాచ్ ల్లో నెగ్గిన టీమిండియా రెండు మ్యాచ్ ల్లో ఓటమిపాలైంది. 

ఈ టోర్నీలో బ్రిడ్జ్ టౌన్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్ ఆడిన టీమిండియా ఆ మ్యాచ్ లో విజయం సాధించింది. అటు, దక్షిణాఫ్రికా ఈ టోర్నీలో బ్రిడ్జిటౌన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 

ఇక్కడి పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ కు సమానంగా సహకరిస్తుందని పేరుంది. ఈసారి ప్రపంచ కప్ లో బ్రిడ్జిటౌన్ వేదికగా 6 మ్యాచ్ లు జరగ్గా... ఐదు మ్యాచ్ ల్లో ఫలితం తేలగా, ఒక మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. మూడు మ్యాచ్ ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు గెలవగా... మూడు మ్యాచ్ ల్లో ఛేజింగ్ చేసిన జట్లు నెగ్గాయి. 

టీ20ల్లో ఓవరాల్ గా చూస్తే బ్రిడ్జిటౌన్ లో 19 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లనే విజయలక్ష్మి వరించింది. 11 సార్లు రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లు గెలుపొందాయి.

  • Loading...

More Telugu News