Vande Bharat Express Rail: వరల్డ్ క్లాస్ వందేభారత్ రైలులో భారీ వర్షం.. తడిసిపోయిన ప్రయాణికులు.. వీడియో ఇదిగో!
- వందేభారత్ రైలు రూఫ్ నుంచి కురిసిన వర్షం
- నీళ్లతో నిండిపోయిన బోగీ
- అవస్థలు పడిన ప్రయాణికులు
మొన్న అయోధ్య ఆలయం.. నిన్న ఎయిర్ పోర్టు, వంతెనలు, నేడు వరల్డ్ క్లాస్ వందేభారత్ రైలు.. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా?.. చిన్నపాటి వర్షానికి కారిపోతున్న, కూలిపోతున్న వాటి జాబితా ఇది. వర్షం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1 రూఫ్ కుప్పకూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. దానికింద పార్క్ చేసిన వాహనాలు నుజ్జునుజ్జుగా మారాయి.
మొన్న అయోధ్యలో కురిసిన వానకు గర్భగుడిలోకి నీళ్లొచ్చాయి. అంతేనా?.. ఆ తర్వాత కురిసిన వర్షాలకు టెంపుల్ టౌన్ కాస్తా మునిగిపోయింది. మోకాళ్ల లోతు నీటిలో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తలదాచుకునేందుకు కాసింత చోటు దొరక్క నరకం అనుభవించారు. ఇక, బీహార్‌లో కొద్దిపాటి వర్షాలకే వంతెనలు పేకమేడల్లా కుప్పకూలుతున్నాయి. పది, పదకొండు రోజుల వ్యవధిలో ఏకంగా ఐదు వంతెనలు కుప్పకూలాయి.
తాజాగా ఈ జాబితాలో వరల్డ్ క్లాస్ వందేభారత్ రైలు చేరింది. బయట కురుస్తున్న వర్షం బోగీల్లోనూ కురిసింది. మామూలుగా కాదు.. ధారాళంగా. దీంతో రైలు లోపలున్న ప్రయాణికులకు తమకితాము ఎక్కడున్నామో అర్థం కాలేదు. బోగీ మొత్తం నీరు పారింది. ప్రయాణికులు తడిసి ముద్దయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అంతేకాదు, వర్షానికి ఢిల్లీ ఎయిమ్స్‌లోకి నీరు చేరిన వీడియోలను పోస్టు చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.