Delhi Rains: మొన్నటి వరకు ఎండలు.. ఇప్పుడు వర్షాలు.. ఢిల్లీలో ఆరుగురి మృతి.. అంతా ఆగమాగం!
- దేశ రాజధానిలో నిన్న ఒక్క రోజే 228.1 మిల్లీమీటర్ల వర్షం
- జూన్‌లో ఈ స్థాయిలో వర్షం 88 ఏళ్లలో ఇదే తొలిసారి
- మృతుల్లో ఇద్దరు చిన్నారులు.. ముగ్గురు నిర్మాణ కూలీలు
- విద్యుత్తు సరఫరాకు అంతరాయం
- వరద నీటితో కలిసిపోయిన రోడ్లు, వీధులు
- జులై 1 వరకు ఢిల్లీకి భారీ వర్ష సూచన
నిన్నమొన్నటి వరకు ఎండలతో అల్లాడిపోయిన ఢిల్లీ ప్రజలకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చిపడింది. ఢిల్లీలో నిన్న ఒక్క రోజు కురిసిన వర్షం 88 ఏళ్ల రికార్డులను తిరగరాసింది. 24 గంటల్లో ఏకంగా 228.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జూన్‌లో ఈ స్థాయిలో వర్షం పడడం ఇదే తొలిసారి. జులై 1వ తేదీ వరకు రాజధానిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది.
భారీ వర్షం కారణంగా ఢిల్లీలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో 8, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు కూలీలు మరణించారు. రోడ్లు, వీధులు తేడాలేకుండా వర్షపు నీటితో కలిసిపోయాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ విమానాశ్రయంలో నిన్న పైకప్పు కూలిన టెర్మినల్-1ను నేడు కూడా మూసివేశారు. చాలా ప్రాంతాల్లో చెట్లు కూలాయి. ఓ అండర్‌పాస్‌లో వరద నీటిలో బస్సు చిక్కుకుపోయింది.