Sourav Ganguly: ఫైనల్లో టీమిండియా ఓడిపోతే రోహిత్ బహుశా సముద్రంలో దూకుతాడేమో: సౌరవ్ గంగూలీ
- సరదా వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ దిగ్గజం
- 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లోనూ భారత్ ఓటమి నేపథ్యంలో ఫన్నీ కామెంట్స్
- రోహిత్ కెప్టెన్సీలో భారత్ మెరుగుపడిందని ప్రశంసలు కురిపించిన గంగూలీ
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇవాళ టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఎనిమిది నెలల వ్యవధిలో టీమిండియా ఆడనున్న రెండవ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఇది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ నవంబర్ 19న జరిగింది. ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ చేరింది. అయితే అనూహ్య రీతిలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైంది. దీంతో ఇవాళ జరగనున్న టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని గెలిచి ఐసీసీ టైటిల్ కరవును తీర్చుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. కరుణించాలని అభిమానులు సైతం తమ ఇష్ట దైవాలను ప్రార్థిస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ దిగ్గజం సౌరవ్ గంగూలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. శనివారం జరగనున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో కూడా భారత్ ఓడిపోతే కెప్టెన్ రోహిత్ శర్మ బహుశా బార్బడోస్‌లోని సముద్రంలో దూకుతాడేమోనంటూ సరదా వ్యాఖ్యలు చేశాడు. భారత్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా రెండు సార్లు జట్టుని వరల్డ్ కప్ ఫైనల్స్‌కు తీసుకెళ్లాడని, అతడి కెప్టెన్సీ సామర్థ్యం, నాయకత్వ లక్షణాలను ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయని గంగూలీ ప్రశంసించాడు.
తాను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విరాట్ కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడని, ఆ సమయంలో రోహిత్‌కు పగ్గాలు అప్పగించేందుకు చాలా సమయం పట్టిందని గంగూలీ గుర్తుచేసుకున్నాడు. కెప్టెన్ బాధ్యతలు తీసుకునేందుకు అతడు సిద్ధంగా లేడని, అతడిని సిద్ధం చేయడానికి చాలా సమయం పట్టిందని గంగూలీ ప్రస్తావించాడు. ప్రస్తుతం అతడి సారధ్యంలో భారత క్రికెట్ పురోగతి పట్ల తనకు చాలా సంతోషంగా ఉందని గంగూలీ పేర్కొన్నాడు. టోర్నీ షెడ్యూల్, సమయం కారణంగా ఐపీఎల్ టైటిల్స్ గెలవడం కొన్నిసార్లు సవాలుగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. శుక్రవారం కోల్‌కతాలో ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న గంగూలీ ఈ మేరకు మీడియాతో మాట్లాడాడు.