Kinjarapu Ram Mohan Naidu: ఢిల్లీ ఎయిర్ పోర్టు ఘటన దురదృష్టకరం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

Aviation minister Ram Mohan Naidu visits Delhi airport after canopy collapsed

  • ఢిల్లీలో భారీ వర్షాలు
  • విమానాశ్రయంలో కూలిపోయిన టెర్మినల్-1 పైకప్పు
  • ఒకరి మృతి, పలువురికి గాయాలు
  • సంఘటన స్థలానికి వెళ్లిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు

ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇక్కడి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని టెర్మినల్-1 పైకప్పు కూలిపోవడం తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనతో దేశంలోని విమానాశ్రయాల్లోని మౌలిక సదుపాయాలపై చర్చ మొదలైంది. 

ఢిల్లీ ఎయిర్ పోర్టు ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ రూఫ్ కూలిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎయిర్ పోర్టులో టెర్మినల్ పైకప్పు కూలిపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభమైందని వెల్లడించారు. 

ఈ ఘటనకు దారితీసిన కారణాలను అంచనా వేసేందుకు నిపుణులను రప్పిస్తున్నామని తెలిపారు. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. 

అంతేకాకుండా, ఢిల్లీ ఘటనను దృష్టిలో ఉంచుకుని, దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో భవనాల స్థితిగతులను పరిశీలిస్తామని ప్రకటించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని చెప్పారు. 

ప్రస్తుతం ఢిల్లీ ఘటనపై సమీక్షిస్తున్నామని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఢిల్లీ ఎయిమ్స్, సఫ్దర్ జంగ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను తాను ఇప్పటికే పరామర్శించానని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చానని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

More Telugu News