Team India: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం బార్బడోస్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు
- ముగింపు దశకు చేరుకున్న టీ20 వరల్డ్ కప్
- రేపు (జూన్ 29) బార్బడోస్ లో ఫైనల్ మ్యాచ్
- టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్న టీమిండియా × ఆఫ్ఘనిస్థాన్
గత కొన్ని వారాలుగా క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించిన టీ20 వరల్డ్ కప్ ముగింపు దశకు చేరుకుంది. రేపు (జూన్ 29) బార్బడోస్ లోని కెన్సింగ్ టన్ ఓవల్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టీ20 వరల్డ్ టైటిల్ కోసం టీమిండియా, దక్షిణాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. దక్షిణాఫ్రికా జట్టు ఆఫ్ఘనిస్థాన్ ను ఓడించి ఫైనల్ చేరుకోగా... ఇంగ్లండ్ ను చిత్తుచేసి టీమిండియా ఫైనల్ కు దూసుకొచ్చింది.
కాగా, ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు బార్బడోస్ చేరుకున్నారు. గయానా నుంచి బార్బడోస్ వచ్చిన టీమిండియా ఆటగాళ్లు ఎయిర్ పోర్టు నుంచి నేరుగా హోటల్ కు వెళ్లిపోయారు.
ఈ వరల్డ్ కప్ ఫైనల్ కు ఓ ప్రత్యేకత ఉంది. క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికా జట్టు ఓ వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకోవడం ఇదే మొదటిసారి. గతంలో ఆ జట్టు పలుమార్లు సెమీస్ లోనే వెనుదిరిగింది. ఈసారి ఏకంగా కప్ చేజిక్కించుకోవాలని తహతహలాడుతోంది.
అయితే, రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఈ టోర్నీలో ఆడుతున్న తీరు చూస్తే ఏ జట్టయినా సరే టైటిల్ పై ఆశలు వదులుకోవాల్సిందే. మరి రేపటి ఫైనల్లో ఏం జరుగుతుందో చూడాలి.
టీమిండియా 2007లో నిర్వహించిన మొదటి టీ20 వరల్డ్ కప్ లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ టీ20 టైటిల్ గెలవలేకపోయింది. ఇప్పుడు మరోసారి టైటిల్ గెలిచే సువర్ణావకాశం టీమిండియా ముందు నిలిచింది.