BRS: ఏ విషయం గురించి అడిగినా తమకు తెలియదని మంత్రులు అంటున్నారు: బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విమర్శలు
- ఇది ప్రజాపాలనా? తుగ్లక్ పాలనా? అంటూ విమర్శలు
- తెలంగాణలో ఫేక్ ప్రభుత్వం నడుస్తోందనడానికి ఇది నిదర్శనమని వ్యాఖ్య
- పరిణామాలు చూస్తుంటే ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నడిపిస్తున్నట్లుగా కనిపించడం లేదని వ్యాఖ్య
నకిలీ బీర్లు తయారు చేసే సోమ్ డిస్టిలరీస్‌కు అనుమతులు ఇచ్చిన విషయం తనకు తెలియదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెబుతున్నారని... అసలు ఇది ప్రజాపాలనా? తుగ్లక్ పాలనా? అని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ ఏది అడిగినా తమకు తెలియదు... సంబంధం లేదని చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణలో ఫేక్ ప్రభుత్వం నడుస్తోందనడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి, మంత్రుల పరిస్థితిని చూస్తే అర్థమవుతోందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు.. కేవలం డమ్మీలుగా ఉన్నారా? వారి నిర్ణయాలు డమ్మీగా ఉన్నాయా? అధికారులు మంత్రులకు చెప్పడం లేదా? లేదా తప్పించుకునేందుకు మంత్రులే సాకులు చెబుతున్నారా? అసలు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. ఆయనకు సమాచారం లేకుండానే పోలీస్ శాఖ వారు రాత్రి పదిన్నర వరకు పౌరులపై ఆంక్షలు పెడుతున్నారా? చెప్పాలన్నారు. ఈ అంశంపై మీడియాలో, సోషల్ మీడియాలో చర్చ జరిగినప్పుడు మాత్రం.... తప్పుడు న్యూస్ అని ముఖ్యమంత్రి, మంత్రులు చెబుతున్నారన్నారు.
కోట్లాది రూపాయల ఆర్టీసీ టిక్కెటింగ్ కాంట్రాక్ట్ గురించి తనకు సమాచారం లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారని విమర్శించారు. ఈ పరిణామాలు చూస్తుంటే ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నడిపిస్తున్నట్లుగా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. తుగ్లక్ పాలన కనిపిస్తోందన్నారు. ఏ విషయం గురించి అడిగినా తమకు తెలియదని మంత్రులు అంటున్నారని... మరి ప్రభుత్వం ఎలా నడుస్తుందో చెప్పాలన్నారు.