Ganta Srinivasa Rao: ఆంధ్రా యూనివర్సిటీ ప్రమాణాలను, ప్రతిష్టను జ‌గ‌న్‌ దిగజార్చారు: గంటా శ్రీనివాస‌రావు

Ganta Srinivasa Rao Fire on Ex CM Jagan in the matter of Andhra University

  • కరుడుగట్టిన వైసీపీవాది ప్రసాదరెడ్డిని వైస్ ఛాన్సలర్‌గా నియ‌మించారంటూ ఫైర్‌
  • యూనివర్సిటీని వైసీపీ ఒక ఫక్తు రాజకీయ కేంద్రంగా మార్చేసింద‌న్న మాజీ మంత్రి 
  • రూ. 100 కోట్ల రూసా నిధులను దారి మళ్లించారంటూ ఆరోప‌ణ‌
  • రిజిస్ట్రార్ స్టీఫెన్ త‌న‌ నియామకం ఫైల్‌పై ఆయనే సంతకం చేసుకోవడం విడ్డూరమ‌న్న గంటా 
  • నోటిఫికేష‌న్ లేకుండా నచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని విమ‌ర్శ‌

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా మ‌రోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రా యూనివర్సిటీ ప్రమాణాలను, ప్రతిష్టను జ‌గ‌న్ దిగజార్చారని విమర్శించారు. వైస్ ఛాన్సలర్‌గా కరుడుగట్టిన వైసీపీవాది ప్రసాదరెడ్డిని నియమించి ఈ గడిచిన ఐదేళ్లలో యూనివర్సిటీ ప్రతిష్టను అమాంతం దిగజార్చారని దుయ్య‌బ‌ట్టారు. 

గాంధీ విగ్రహం పక్కనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టించి యూనివర్సిటీని ఒక రాజకీయపార్టీ కార్యాలయంగా మార్చేశారని మండిప‌డ్డారు. దేవాలయం లాంటి ఈ పవిత్రమైన విద్యాసంస్థను వైసీపీ ప్రభుత్వం ఒక ఫక్తు రాజకీయ కేంద్రంగా మార్చేసిందంటూ గంటా విమ‌ర్శించారు.

ఆంధ్రా యూనివర్సిటీ అంటే ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉండేదన్నారు. విద్యా ప్రమాణాల పరంగా ఎక్కడకు వెళ్ళినా ఆంధ్రా యూనివర్సిటీ పట్టా అంటే చాలా విలువనిచ్చే వాళ్లని.. ఇప్పుడు ఆంధ్రా యూనివర్సిటీ ప్రతిష్ఠను మసకబారేలా చేశారని ఫైర్ అయ్యారు. విద్యా ప్రమాణాలు పడిపోయాయని.. విద్యలో నాణ్యత ఎప్పుడూ లేనంతగా దిగజారిపోయేలా చేశారన్నారు. 

వైసీపీ స‌ర్కార్‌ నియమించిన వైస్ ఛాన్సలర్ ప్రసాదరెడ్డి.. వైస్ ఛాన్సలర్‌లా కాకుండా కరడు గట్టిన వైసీపీ నాయకుడిలా, రాజా రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ యూనివర్సిటీని భ్రష్ఠు పట్టించాడని పేర్కొన్నారు. వైస్ ఛాన్సలర్ అయ్యాక ప్రసాదరెడ్డి యూనివర్సిటీలో బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి పుట్టినరోజు వేడుకలు, పార్టీ కార్యకలాపాలు చేయడం మొదలు పెట్టేశారన్నారు. విద్యా సంస్థల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదని ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే వారిపై పోలీసు కేసులు పెట్టించి వేదింపులకు గురి చేసేవార‌ని మాజీ మంత్రి గుర్తు చేశారు.

రూ. 100 కోట్ల రూసా నిధులను దారి మళ్లించి అస్తవ్యస్తం చేశార‌ని గంటా మండిప‌డ్డారు. ల్యాబ్ లు, ఈ-క్లాస్ రూమ్ లు, రీసెర్చ్, విద్యా ప్రామాణికత పెంచడం కోసం ఇచ్చిన రూ. 100 కోట్ల R.U.S.A. నిధులన్నింటిని భవనాల నిర్మాణానికి, ప్రహరీ గోడలు కట్టడానికి, చెట్లు కొట్టడానికి, సెక్యూరిటీ వంటి పనులకు మళ్లించి దుర్వినియోగం చేశారన్నారు. ఏ విభాగంలోనూ ఒక్క ల్యాబ్ ను కూడా ఆధునీకరించలేదని దుయ్య‌బ‌ట్టారు.

ఇక రిజిస్ట్రార్ స్టీఫెన్ బాగోతం కూడా అంతే..!
ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో సాధారణ లెక్చరర్ గా ఉన్న స్టీఫెన్ ఎంసీఏ చదివారు. అలాంటి వ్యక్తిని తీసుకువచ్చి నిబంధనలకు వ్యతిరేకంగా అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ గా నియమించారు. ఆ సమయంలో స్టీఫెన్ ఆంధ్రా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ఆయనే సభ్యుడిగా ఉంటూ ఆయన నియామకం ఫైల్ పై ఆయనే సంతకం చేసుకోవడం విడ్డూరమ‌న్నారు.

కేవలం స్టీఫెన్ కోసమే ట్రాన్స్ డిసిప్లిన‌రీ రిసెర్చ్ (టీడీఆర్‌) హబ్ ను ఏర్పాటు చేసి ఆయన్ని డీన్ గా నియమించార‌ని గంటా విమ‌ర్శించారు. నిబంధనలను తుంగలోకి తొక్కి ఈ హబ్ ద్వారా పీహెచ్‌డీ సీట్లు ఇచ్చారని, టీడీఆర్‌ హబ్ యూనివర్సిటీ భవనాలను ప్రైవేట్ సంస్థలకు ఇష్టానుసారంగా లీజుకు ఇచ్చేశార‌ని గుర్తు చేశారు.

అర్హతలున్న ఎంతోమంది ప్రొఫెసర్లు ఆంధ్రా యూనివర్సిటీలో ఉండగా ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ లో లెక్చరర్ గా వచ్చిన స్టీఫెన్ ను రిజిస్ట్రార్ గా నియమించేలా చేయడం వైస్ ఛాన్సలర్ అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా గంటా శ్రీనివాస‌రావు అభివ‌ర్ణించారు.

అర్హులను వదిలేసి రిటైర్ ఉద్యోగులకు పునరావాసం
ఆంధ్రా యూనివర్సిటీలో అర్హతలున్న అనేకమంది ఉద్యోగులుండగా రిటైర్ అయిన తనకు ఇష్ఠులైన మాజీలకు అత్యున్నతమైన పదవులను కట్టబెట్టారంటూ దుమ్మెత్తిపోశారు గంటా. రిటైర్డ్ ప్రొఫెసర్ కృష్ణమోహన్ ను రిజిస్ట్రార్ గా నియమించ‌డంతో పాటు డీన్ లు, డైరెక్టర్లు వంటి ముఖ్యమైన పదవులను మాజీలకు కట్టబెట్టడం ఇందులో భాగమేన‌న్నారు.

నోటిఫికేష‌న్ లేకుండా నచ్చిన వారికి ఉద్యోగాలు
అదేవిధంగా ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా నచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చేశార‌ని గంటా శ్రీనివాస‌రావు ఆరోపించారు. ఒక పేపర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఎలాంటి రిక్రూట్మెంట్ విధానం లేకుండా తనకు కావాల్సిన 150 మందిని ప్రొఫెస‌ర్ ఆన్ ప్రాక్టీస్‌, అనుబంధ ప్రొఫెసర్లుగా నియమించుకుని నెలకు రూ. 80 వేల నుంచి లక్ష రూపాయల చొప్పున జీతాలిస్తున్నారని మండిపడ్డారు. 

ఒక కంప్యూటర్ సైన్స్ విభాగంలోనే ఈ కోటాలో ఏకంగా 30 మందిని నియమించిన‌ట్లు తెలిపారు. యూజీసీ  నిబంధనలు వ్యతిరేకంగా ప్రైవేట్ డిగ్రీ కాలేజీ లెక్చరర్లను డీన్లుగా, వార్డెన్లుగా, డిపార్ట్మెంట్ హెడ్లుగా, బోర్డు ఆఫ్ స్టడీస్ ఛైర్మెన్లుగా పదవులు పంచేశారంటూ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై గంటా దుమ్మెత్తిపోశారు.

ప్లేస్మెంట్ ఆఫీసర్లుగా బయట వ్యక్తులను నియమించుకున్నారు. ఎప్పటినుంచో పని చేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీలను తొలగించి ఆ స్థానాల్లో డిగ్రీ కాలేజీ లెక్చరర్లను నియమించడం వల్ల ఆయా డిగ్రీ కాలేజీల్లో టీచింగ్ బాగా దెబ్బతినేలా చేశార‌ని ఫైర్ అయ్యారు. డిగ్రీ కాలేజీ లెక్చరర్ లకు పీహెచ్‌డీ గైడ్ లుగా అర్హతనిచ్చి ఆంధ్రా యూనివర్సిటీ పరిశోధన పట్టా ప్రామాణికత ప్రశ్నార్థకంగా మార్చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు.

అయితే, రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకొచ్చి.. దేశంలో నంబర్ వన్ యూనివర్సిటీగా తీర్చిదిద్దడం తథ్యమని ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ పేర్కొన్నారు. ఇది గుర్తు పెట్టుకోవాలని జగన్‌కు గంటా శ్రీనివాసరావు సూచించారు.

More Telugu News