BRS: ఢిల్లీ విమానాశ్రయ పైకప్పు కూలిన ఘటనపై బీఆర్ఎస్ చురకలు!
- ఈ ఘనటపై 'ఎక్స్' వేదికగా స్పందించిన బీఆర్ఎస్
- మోదీ ఎన్నికల ప్రచార స్టంట్ ఇలా మిస్‌ఫైర్ అయిందంటూ విమర్శ
- ఒక వ్యక్తి తన ప్రచార ఆర్భాటం కోసం చేసిన తొందరపాటు చర్యగా పేర్కొన్న గులాబీ పార్టీ
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం తెల్లవారుజామున టెర్మినల్-1డీ పైకప్పు కూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘనటపై బీఆర్ఎస్ పార్టీ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించింది. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార స్టంట్ ఇలా మిస్‌ఫైర్ అయిందని విమర్శించింది.
జనరల్ ఎన్నికల్లో ప్రచారం కోసం నిర్మాణం పూర్తికాని ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1ను ప్రధాని మోదీ హడావుడిగా మార్చిలో ప్రారంభించారని దుయ్యబట్టింది. కేవలం ఎన్నికల స్టంట్ కోసం ఇలా అసంపూర్ణంగా నిర్మితమైన టెర్మినల్‌ను ప్రారంభించడంతోనే ఇవాళ ఈ దుర్ఘటనకు కారణమైందని బీఆర్ఎస్ తెలిపింది.
ఫలితంగా ఒకరి మరణం, పలువురికి గాయాలు అని పేర్కొంది. ఒక వ్యక్తి తన ప్రచార ఆర్భాటం కోసం చేసిన తొందరపాటు చర్య ఇలా భారీ నష్టానికి దారితీసిందని చెప్పుకొచ్చింది. రూఫ్ లీకేజీ నుంచి పేపర్ లీకేజీ వరకు మోదీ 3.O పాలన డిజాస్టర్ అని నిరూపించిందంటూ ట్వీట్ చేసింది.
కాగా, ఈ తెల్లవారుజామున విమానాశ్రయంలోని టెర్మినల్-1డీ పైకప్పు షీట్‌తోపాటు దానికి సపోర్టింగ్‌గా ఉన్న పిల్లర్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో డిపార్చర్ లైన్ వద్ద పార్క్ చేసిన కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి.