Karnataka: వధువును వెతికిపెట్టాలని కోరుతూ అధికారులకు రైతు దరఖాస్తు!
- కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాలో ఘటన
- వధువును వెతికిపెట్టాలంటూ అధికారుల సహాయం కోరిన రైతు సంగప్ప
- పదేళ్లుగా ప్రయత్నిస్తున్నా తనకు వధువు దొరకలేదని ఆవేదన
- పెళ్లికూతురు దొరకకపోవడం తన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసిందన్న రైతు
కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాలో యువ రైతు సంగప్ప తన కోసం వధువును వెతికి పెట్టాలని జిల్లా అధికారులకు దరఖాస్తు చేశాడు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు అధికారులు స్థానికంగా ఒక సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సంగప్ప తనకు ఓ అమ్మాయిని వెతికి పెట్టాలని దరఖాస్తు చేశాడు.
సంగప్ప తన దరఖాస్తుతో జిల్లా కమీషనర్ నళిని అతుల్‌ను కలిశారు. అందులో తాను గత 10 సంవత్సరాలుగా వధువు కోసం వెతుకుతున్నానని తెలిపాడు. కానీ, తనను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదని పేర్కొన్నాడు. గత దశాబ్ద కాలంగా జరుగుతున్న ఈ పరిణామం వల్ల తన మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిందని చెప్పాడు.
"నేను పదేళ్లుగా అమ్మాయి కోసం వెతుకుతున్నా. నన్ను పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మానసిక క్షోభ అనుభవిస్తున్నా. దయచేసి నాకు వధువును వెతికిపెట్టడానికి ఒక బ్రోకర్ ద్వారా సహాయం చేయండి" అని సంగప్ప జిల్లా అధికారిని వేడుకున్నాడు. ఈ విషయం కాస్తా బయటకు రావడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.