Train Accident: రష్యాలో పట్టాలు తప్పిన రైలు.. నదిలో పడ్డ బోగీలు.. వీడియో ఇదిగో!
- 70 మంది ప్రయాణికులకు గాయాలు
- కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
- పలువురి పరిస్థితి సీరియస్ గా ఉందన్న వైద్యులు
రష్యాలో ఓ రైలు పట్టాలు తప్పడంతో అందులో ప్రయాణిస్తున్న 70 మందికి పైగా గాయపడ్డారు. బుధవారం నార్తరన్ కోమి రీజియన్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలు తప్పడంతో తొమ్మిది బోగీలు కోమి నదిలో పడిపోయాయి. నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే స్పందించామని, రెస్క్యూ టీమ్ లు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు సాయం చేశాయని కోమి రీజనల్ గవర్నర్ వ్లాదిమిర్ ఉయ్ బా చెప్పారు. బాధితులలో ముగ్గురి పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు చెప్పారన్నారు. ప్రమాదం జరిగిన రైలులో 215 మంది ప్రయాణికులు ఉన్నారని వివరించారు.
రెస్క్యూ బృందాలు, ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తొమ్మిది బోగీలు పట్టాలు తప్పడంతో అందులో ఉన్న 70 మంది గాయపడ్డారు. వారిలో కొందరికి స్వల్ప గాయాలు కాగా మరికొందరికి సీరియస్ గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందించే ఏర్పాట్లు చేసినట్లు ఉయ్ బా వివరించారు. కోమి రీజియన్ లో ఇటీవలి భారీ వరదలకు రైలు పట్టాలు దెబ్బతిన్నాయని, తాజా ప్రమాదానికి కారణమిదేనని ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నదిలో పడిపోయిన బోగీలు, అందులో నుంచి అతికష్టమ్మీద బయటపడుతున్న ప్రయాణికులు ఈ వీడియోలో కనిపిస్తున్నారు.