Bharatiya Nyaya Sanhita: జులై 1 నుంచి కొత్త నేర న్యాయ చట్టాలు.. ఇకపై అన్నీ ఆన్‌లైన్‌లోనే.. తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి!

Implementation of Bharatiya Nyaya Sanhita from July 1

  • ఫిర్యాదుల నుంచి సమన్ల జారీ వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే
  • సత్వర న్యాయానికి రెండంటే రెండే వాయిదాలు
  • హేయమైన నేరాల దృశ్యాలకు వీడియోగ్రఫీ తప్పనిసరి
  • పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా జీరో ఎఫ్ఐఆర్

జీరో ఎఫ్ఐఆర్, ఫిర్యాదులు, సమన్ల జారీ వంటివన్నీ ఇకపై ఆన్‌లైన్ ద్వారానే జరగనున్నాయి. జులై 1 నుంచి దేశంలో కొత్తగా నేర న్యాయ చట్టలలో భారీ మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న ఇండియన్ పీనల్ కోడ్‌ (ఐపీసీ), సీఆర్‌పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లలో భారీ మార్పులు చేసిన ప్రభుత్వం దానిని ‘భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్’ గా మార్చింది.

ఈ కొత్త చట్టాల అమల్లో పలు మార్పులు కనిపించనున్నాయి. ఇకపై అన్నీ ఎలక్ట్రానిక్ మాధ్యమంలోనే జరగనున్నాయి. హేయమైన నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేస్తారు. ఈ కొత్త చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు  దాదాపు 40 లక్షలమంది క్షేత్రస్థాయి సిబ్బందికి, 5.65 లక్షల మంది పోలీసులు, జైళ్ల అధికారులు, ఫోరెన్సిక్ నిపుణలకు శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ చట్టాలు అమల్లోకి రావడంతోనే పలు మార్పులు చోటుచేసుకున్నాయి.

బాధితుడు ఇకపై నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేయొచ్చు.
జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఎవరైనా పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు.
అరెస్ట్ అయిన బాధితుడు ఆ విషయాన్ని తన స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులకు తన పరిస్థితి తెలియజేసే వీలుంటుంది. దీనివల్ల బాధితుడికి తక్షణసాయం లభించే వీలుంటుంది.
అరెస్ట్ వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌తోపాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు. దీనివల్ల బాధితుల కుటుంబ సభ్యులు, స్నేహితులకు ముఖ్యమైన సమాచారం తెలిసే వీలుంటుంది.
హేయమైన నేరాల్లో వీడియోగ్రఫీ తప్పనిసరి. దీనివల్ల దర్యాప్తులో నాణ్యత పెరిగే అవకాశం ఉంది.
మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తు రెండు నెలల్లోనే పూర్తికావాలి. బాధిత మహిళలు, చిన్నారులకు ఉచితంగా ప్రాథమిక చికిత్స, వైద్య చికిత్స అందించాల్సి ఉంటుంది.
సమన్లను ఇకపై నేరుగా వెళ్లి ఇవ్వాల్సిన పనిలేదు. ఆన్‌లైన్‌లో పంపించవచ్చు.
మహిళలపై నేరాల విషయంలో బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయాలి. వారు లేని పక్షంలో మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచాలి.
బాధితులతోపాటు నిందితులకు కూడా ఎఫ్ఐఆర్ కాపీ నకలును ఉచితంగా అందిస్తారు. పోలీస్ రిపోర్ట్, చార్జిషీట్, స్టేట్‌మెంట్లు, ఇతర డాక్యుమెంట్లను రెండువారాల్లో పొందొచ్చు.
కేసు విచారణలో అనవసర ఆలస్యాన్ని నివారించేందుకు కోర్టులు గరిష్ఠంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేయాలి.
సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలుచేయాలి.
అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి.
మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారితోపాటు 15 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లకు మించి వయసున్నవారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. వారు తాము నివసిస్తున్న చోటే పోలీసుల సాయం పొందొచ్చు.

Bharatiya Nyaya Sanhita
New Criminal Laws
Crimes
FIR
  • Loading...

More Telugu News