Madhavi Reddy: ప్రతిపక్ష హోదాపై స్పీకర్‌కు జగన్ లేఖ రాయడంపై కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఆగ్రహం

Kadapa MLA Madhavi Reddy fires at YS Jagan

  • సభ్యుల్లో 10వ వంతు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని తెలియదా? అంటూ ప్రశ్న
  • ఆరుగురు ఎమ్మెల్యేలను పీకేస్తే టీడీపీకి ప్రతిపక్ష హోదా పోతుందన్న వ్యాఖ్యలు మరిచావా? అని నిలదీత
  • జగన్ ఇప్పటికైనా అధికార భ్రాంతి నుంచి బయటకు రావాలని వ్యాఖ్య

తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సభాపతికి జగన్ లేఖ రాయడం సిగ్గుచేటని టీడీపీ కడప ఎమ్మెల్యే ఆర్.మాధవీరెడ్డి ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... మొత్తం సభ్యుల్లో 10వ వంతు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని... ఈ విషయంపై కనీస అవగాహన లేకుండా జగన్ కోరడం విడ్డూరంగా ఉందన్నారు.

ఆరుగురు ఎమ్మెల్యేలను పీకేస్తే టీడీపీకి ప్రతిపక్ష హోదా పోతుందని తాను అన్న మాటలను జగన్ మరిచిపోయారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయితేనే మీరు అసెంబ్లీకి వస్తారా? అలాంటప్పుడు పులివెందుల ప్రజలు మీకు ఓటు వేసి ఎందుకు గెలిపించారు? అని నిలదీశారు. మీ నియోజకవర్గ సమస్యలు మీకు పట్టవా? అన్నారు. జగన్ ఇప్పటికైనా అధికార భ్రాంతి నుంచి బయటకు రావాలన్నారు.

వైసీపీ పాలనలో నష్టపోని వ్యక్తి లేరన్నారు. ఎన్నికల్లో జగన్‌కు ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పడంతో ఇప్పుడు ప్రతిపక్ష హోదా అంటూ కొత్త నాటకాలకు తెరలేపారని విమర్శించారు. ప్రజల వద్దకు వెళ్లి ముఖం చూపించుకోలేక జగన్ కుయుక్తులకు తెరలేపారన్నారు. స్పీకర్ ఎన్నిక రోజున వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ సభకు రాలేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News