Pinnelli Ramakrishna Reddy: బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన హైకోర్టు... పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

Pinnelli arrested by AP Police

  • ఈవీఎం ధ్వంసం, పలువురిపై దాడి కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు
  • ఎస్పీ కార్యాలయానికి పిన్నెల్లి తరలింపు
  • అంతకుముందు నాలుగు బెయిల్ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు

మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈవీఎం ధ్వంసం, పలువురిపై దాడి కేసులో ఏపీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. పిన్నెల్లిని పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి మాచర్ల కోర్టుకు తరలించే అవకాశముంది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

నాలుగు బెయిల్ పిటిషన్ల కొట్టివేత

అంతకుముందు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం సహా మరో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నాలుగు కేసులలో ఆయన ఇప్పటి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. కానీ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసిన ధర్మాసనం నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్లనూ తిరస్కరించింది.

ఎన్నికల పోలింగ్ రోజు పాల్వాయిగేటు పోలింగ్ బూత్‌లో పిన్నెల్లి ఈవీఎంను బద్దలు కొట్టడంతో పాటు అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ప్రశ్నించిన ఓ మహిళను దుర్భాషలాడారు. పోలింగ్ మరుసటిరోజు పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారు. సీఐపై దాడి చేసి గాయపరిచారు. వీటన్నింటిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోసం నాలుగు పిటిషన్లు దాఖలు చేశారు. జూన్ 20న హైకోర్టులో వాదనలు ముగియగా... నేడు తీర్పు వెలువరించింది. పోలీసుల తరఫున స్పెషల్ కౌన్సిల్‌గా న్యాయవాది అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు. ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.

Pinnelli Ramakrishna Reddy
YSRCP
Lok Sabha Polls
AP Assembly Polls
  • Loading...

More Telugu News