Lok Sabha adjournment: విపక్షాల ఆందోళన.. లోక్‌సభ వాయిదా
- ఎమర్జెన్సీ కాలం ప్రస్తావన తెచ్చిన స్పీకర్
- స్పీకర్ వ్యాఖ్యలపై విపక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన
- గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో సభ రేపటికి వాయిదా
లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా ఎమర్జెన్సీ కాలాన్ని ప్రస్తావించడం వివాదాస్పదంగా మారింది. దేశంలో ఎమర్జెన్సీ అనేదానిని చీకటి రోజులుగా స్పీకర్ పేర్కొన్నారు. దీనిపై విపక్ష ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
అంతకుముందు లోక్‌సభ స్పీకర్‌గా రెండోసారి ఎన్నికైన ఓం బిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. గతంలో కంటే ఈసారి సభలో ప్రతిపక్ష సభ్యుల సంఖ్య పెరిగిందన్న ఆయన.. సభలో తమ గొంతు వినిపించేందుకు స్పీకర్ సహకరించాలన్నారు. సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కితే ప్రజాస్వామ్యానికి మంచిది కాదని తెలిపారు. ప్రజల గొంతు ఎంత సమర్థవంతంగా వినిపించామనేది ముఖ్యమన్నారు. అందుకే సభలో మాట్లాడటానికి ప్రతిపక్షాలకు సమయం ఇవ్వాలని స్పీకర్‌ను ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కోరారు.