Jagan: జగన్ పై విమర్శల దాడి నేపథ్యంలో... అన్నింటికీ బదులిచ్చిన పేర్ని నాని
- జగన్ 986 మందితో భద్రత ఏర్పాటు చేసుకున్నారన్న దాంట్లో నిజంలేదన్న పేర్ని నాని
- చంద్రబాబు, జగన్ ఇళ్లలో ఫర్నిచర్ విలువ ఆడిట్ చేయాలని వ్యాఖ్యలు
- డీకే శివకుమార్ ను జగన్ కలిశారనడంలో వాస్తవంలేదని స్పష్టీకరణ
- ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తప్పుడు వార్తలు రాస్తున్నాయని ఆగ్రహం
- తప్పుడు వార్తలతో తమ మానసిక నైజాన్ని చాటుకుంటున్నాయని విమర్శలు
మాజీ సీఎం జగన్ 986 మందితో రాష్ట్రపతి, ప్రధానిని మించిపోయేలా భద్రత ఏర్పాటు చేసుకున్నారని, రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా వైసీపీ పార్టీ కార్యాలయాలు నిర్మిస్తున్నారని, వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారని, డీకే శివకుమార్ తో మాట్లాడారంటూ వస్తున్న విమర్శలు, మీడియా కథనాలపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. జగన్ పై వచ్చిన ప్రతి ఆరోపణకు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
ఏపీలో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తమ పని తాము చేస్తున్నాయని, తప్పుడు వార్తలు రాస్తూ తమ మానసిక నైజాన్ని చాటుకుంటున్నాయని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 986 మందితో భద్రత ఏర్పాటు చేసుకున్నారన్నది కూడా తప్పుడు కథనమేనని కొట్టిపారేశారు.
జగన్ భద్రతలో భాగంగా ఆర్మ్ డ్ ఫోర్స్ 33 మంది, ఏపీ స్పెషల్ ఫోర్స్ 89 మంది, 13 మంది ఆక్టోపస్ కమాండోలు, ఇతర పోలీసులు 23 మంది, కాన్వాయ్ వెళ్లేటప్పుడు అదనంగా మరో 21 మంది, ఇతర భద్రతా సిబ్బందితో కలిపి మొత్తం 196 మంది పనిచేస్తారని పేర్ని నాని వివరించారు. బెంగళూరులో జగన్ కు భద్రత లేదని స్పష్టం చేశారు.
హైదరాబాదులో జగన్ నివాసం వెలుపల పోలీసులు విశ్రాంతి తీసుకునేందుకే రేకుల షెడ్ వేసుకుంటే, దానిపైనా దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఎన్టీఆర్, చంద్రబాబు, జనార్దన్ రెడ్డి, రోశయ్య... ఇలా సీఎంల ఇళ్ల వద్ద పోలీస్ బ్యారక్ లు ఏర్పాటు చేయడం సహజమేనని, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులే బ్యారక్ లు ఏర్పాటు చేశారని, దాంతో జగన్ కు ఏంటి సంబంధం? అని పేర్ని నాని ప్రశ్నించారు. కానీ రామోజీరావు కొడుకు వాస్తవాలను పట్టించుకోకుండా తప్పుడు వార్తలు రాశారని మండిపడ్డారు.
చంద్రబాబు తాను వెళుతుంటే ట్రాఫిక్ ఆపొద్దని చెప్పాడంటూ తప్పుడు వార్త రాశారని, ఏ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అయినా చంద్రబాబు కాన్వాయ్ ఆగిందా? అని నిలదీశారు. తనతో వస్తే చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఆపుతున్నారో, లేదో చూపిస్తానని పేర్ని నాని సవాల్ విసిరారు.
చంద్రబాబు భద్రతకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మనవడికి కూడా 4 ప్లస్ 4 భద్రత ఇచ్చారా? లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కుటుంబానివే ప్రాణాలా, జగన్ కుటుంబానివి ప్రాణాలు కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ నివాసం ముందు రోడ్డును బ్లాక్ చేశారని రాశారని, మరి గతంలో 2014 నుంచి 2019 వరకు కరకట్ట మీద టీడీపీ ఎమ్మెల్యేలను సైతం ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. ఇక, హైదరాబాదులోని చంద్రబాబు నివాసం విలువ ఎంతో, జగన్ ఇంటి విలువ ఎంతో తేల్చాలి అని పేర్ని నాని డిమాండ్ చేశారు. రాజభవనంలో ఉంటున్న చంద్రబాబు... జగన్ పై ఆరోపణలు చేయడమా? చంద్రబాబు నివాసం ఫొటోలను ఎందుకు చూపించరు? అని నిలదీశారు.
చంద్రబాబు, జగన్ నివాసాల్లోని ఫర్నిచర్ విలువను లెక్కగట్టాలి అన్నారు. కరకట్ట వద్ద చంద్రబాబు కృష్ణానదిలో దిగి కాళ్లు కడుక్కోవడానికి కూడా ప్రజల సొమ్ముతో నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. తన క్యాంపు కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ ను తీసుకెళ్లాలని జగన్ లేఖ రాస్తే, ఇప్పటివరకు ఎందుకు సమాధానం ఇవ్వలేదు అని పేర్ని నాని ప్రశ్నించారు.
వైసీపీ కార్యాలయాలపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన జీవో ప్రకారమే వైసీపీ కార్యాలయాలకు స్థలాలు కేటాయించారని స్పష్టం చేశారు. చంద్రబాబు వారి కార్యాలయాలకు ఎకరం రూ.1000కే భూములు కేటాయించుకున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని కార్యాలయం కూడా ఎకరం వెయ్యి రూపాయలేనని అన్నారు. హైదరాబాదులో పార్టీ ఆఫీసు కోసం స్థలం అని చెప్పి, దాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ గా ఎందుకు మార్చారని నిలదీశారు. మరి ఇవన్నీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
ఆఖరికి జగన్ బెంగళూరు వెళ్లినా దుష్ప్రచారం చేస్తున్నారని, డీకే శివకుమార్ తో చర్చించారంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారని పేర్ని నాని అసంతృప్తి వ్యక్తం చేశారు. నాడు సోనియా, చంద్రబాబు కలిసి 16 నెలలు జైల్లో పెడితేనే జగన్ లొంగలేదని, అలాంటి వ్యక్తి ఇప్పుడు పార్టీని విలీనం చేస్తాడా? అని వ్యాఖ్యానించారు.
అంతేగాకుండా, వాస్తవాలను ప్రజలకు చూపించే న్యూస్ చానళ్లను ఆపేశారని, 65 శాతం ప్రజలు చూసే సాక్షి టీవీని, మరో రెండు చానళ్లను కూడా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మీదట ఆ చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాల్సిందేనని అన్నారు. ఆయా చానళ్లు ప్రసారం చేయకపోతే కోర్టు ధిక్కరణ కేసులు వేస్తామని పేర్ని నాని హెచ్చరించారు.
స్పీకర్ ఎన్నిక సమయంలో వైసీపీ సభ్యులు సభలో లేరంటున్నారని, నాడు తమ్మినేని సీతారాంను స్పీకర్ గా ఎన్నుకున్న సమయంలో టీడీపీ సభ్యులు అసెంబ్లీలో ఉన్నారా? అని ప్రశ్నించారు. జగన్ ను చచ్చే దాకా కొట్టాలి అని వ్యాఖ్యానించిన వ్యక్తిని స్పీకర్ గా చేయడం తమకు నచ్చలేదని, అందుకే ఆ కార్యక్రమాన్ని బహిష్కరించామని వివరించారు.