News Channels: ఏపీలో బ్లాక్ చేసిన న్యూస్ చానళ్లను పునరుద్ధరించండి: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు

Delhi High Court orders to revive blacked news channels in AP

  • సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10టీవీ చానళ్లకు ఢిల్లీ హైకోర్టు ఊరట
  • చానళ్లను పునరుద్ధరించాలని 15 మంది ఎంఎస్ఓలకు ఆదేశాలు
  • ఢిల్లీ హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఎన్ బీఎఫ్, ఎన్ బీడీఏ

ఏపీలో సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలంటూ ఢిల్లీ హైకోర్టు నేడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ఎవరూ అడ్డుకోజాలరని న్యాయస్థానం స్పష్టం చేసింది. బ్లాక్ చేసిన చానళ్లను వెంటనే పునరుద్ధరించి, ప్రసారం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు 15 మంది ఎంఎస్ఓలకు ఆదేశాలు జారీ చేసింది. 

ఢిల్లీ హైకోర్టు తీర్పుపై జాతీయ స్థాయి మీడియా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ ఫెడరేషన్ (ఎన్ బీఎఫ్), న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అండ్ డిజిటల్ అథారిటీ (ఎన్ బీడీఏ) ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను స్వాగతించాయి. బ్లాక్ చేసిన న్యూస్ చానళ్లను పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం అని ఎన్ బీఎఫ్ అభివర్ణించింది.

భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభం వంటిదని, ఢిల్లీ హైకోర్టు తీర్పుతో ఆ విషయం మరోసారి స్పష్టమైందని వివరించింది. ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం వచ్చాక కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించింది. 

ఇక, ఎన్ బీడీఏ స్పందిస్తూ... ఏ అంశాలు ప్రసారం చేయాలన్న దానిపై న్యూస్ చానళ్లకు స్వతంత్రత ఉంటుందన్న విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలని హితవు పలికింది. మీడియా స్వేచ్ఛలో ఎలాంటి జోక్యాలు ఉండరాదని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News