Arvind Kejriwal: కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో దక్కని ఊరట
- ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్
- బెయిల్ నిలుపుదల చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు
- నిన్న లిఖితపూర్వక వాదనలు సమర్పించిన ఈడీ, కేజ్రీవాల్
- బెయిల్ నిలుపుదల ఉత్తర్వులు కొనసాగుతాయంటూ నేడు ఢిల్లీ హైకోర్టు తీర్పు
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. ఆయన బెయిల్ నిలుపుదల చేస్తూ తాము ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని ఢిల్లీ హైకోర్టు బెంచ్ నేడు స్పష్టం చేసింది.
ఇటీవల కేజ్రీవాల్ కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయగా, ఆ బెయిల్ నిలుపుదల చేస్తూ ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇరుపక్షాలను లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని ఢిల్లీ హైకోర్టు ఈడీ, కేజ్రీవాల్ ను ఆదేశించింది. దాంతో ఈడీ అధికారులు, కేజ్రీవాల్ నిన్న తమ లిఖితపూర్వక వాదనలను ఢిల్లీ హైకోర్టుకు సమర్పించారు. ఆ వాదనలను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. దాంతో కేజ్రీవాల్ కు నిరాశ తప్పలేదు.
కాగా, తన బెయిల్ ను ఢిల్లీ హైకోర్టు నిలుపుదల చేయడాన్ని కేజ్రీవాల్ ఇంతకుముందే సుప్రీంకోర్టులో సవాల్ చేయగా... ఢిల్లీ హైకోర్టు తుదితీర్పు వచ్చేవరకు తాము వేచిచూస్తామని సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో, రేపు (జూన్ 26) సుప్రీంకోర్టు కేజ్రీవాల్ బెయిల్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.