Janmabhumi Express: జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చిన రైల్వే శాఖ

SCR reinstated Janmabhumi express

  • విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ఆధునికీకరణ పనులు
  • జూన్ 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్ల రద్దు
  • ప్రయాణికుల నుంచి భారీ ఎత్తున ఆందోళనలు
  • జన్మభూమి, తదితర రైళ్లను పునరుద్ధరిస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటన

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను రైల్వే శాఖ మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చింది. విజయవాడ డివిజన్ లో ఆధునికీకరణ పనులు చేపట్టడంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. 

నిడదవోలు-కడియం సెక్షన్ లో ఆధునికీకరణ పనుల నేపథ్యంలో... జూన్ 23 నుంచి ఆగస్టు 11 వరకు జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్ వంటి ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. అయితే ఈ నిర్ణయం పట్ల ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ప్రయాణికుల నుంచి భారీ ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుండడంతో రైల్వే శాఖ తన నిర్ణయాన్ని మార్చుకుంది. జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను ఈ నెల 25 నుంచి మామూలుగానే నడపాలని తాజాగా నిర్ణయించింది. జన్మభూమి ఎక్స్ ప్రెస్ తో పాటు విజయవాడ-కాకినాడ పోర్టు, చెంగల్పట్టు-కాకినాడ పోర్టు రైళ్లను కూడా పునరుద్ధరిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది.

More Telugu News