Mallikarjun Kharge: 50 ఏళ్ల క్రితంనాటి ఎమర్జెన్సీని మోదీ నిత్యం ప్రస్తావిస్తూనే ఉంటారు కానీ...: ఖర్గే
- నాడు ప్రకటన తర్వాతే ఎమర్జెన్సీని అమలు చేశారన్న ఖర్గే
- ఎలాంటి ప్రకటన చేయకుండా మోదీ ఎమర్జెన్సీని కొనసాగిస్తున్నారని విమర్శ
- ఇలాంటి మాటలతో ఎంతకాలం మభ్యపెడతారంటూ ఆగ్రహం
50 ఏళ్ల క్రితం విధించిన ఎమర్జెన్సీ గురించి ప్రధాని నరేంద్రమోదీ నిత్యం ప్రస్తావిస్తూనే ఉంటారని... కానీ పదేళ్లుగా ఎలాంటి ప్రకటన చేయకుండానే ఎమర్జెన్సీని కొనసాగిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధిస్తున్నామని ప్రకటించాకే దానిని అమలు చేసినట్లు చెప్పారు.
ఇలాంటి మాటలతో ప్రజలను మభ్యపెడుతూ ఎంతకాలం అధికారంలో కొనసాగాలనుకుంటున్నారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతోందన్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందే దేశవ్యాప్తంగా చాలా పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకమయ్యాయని గుర్తు చేశారు.
ఎమర్జెన్సీని ప్రస్తావించిన మోదీ
లోక్ సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ... ఎమర్జెన్సీకి రేపటితో 50 ఏళ్లు పూర్తవుతాయని... దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఓ మాయని మచ్చ అన్నారు. యాభై ఏళ్ళ క్రితం జరిగిన పొరపాటు పునరావృతం కాకూడదని హితవు పలికారు.