Ultra Set: ఉగ్రవాదుల చేతుల్లో చైనా 'అల్ట్రా సెట్'... భారత భద్రతా బలగాలకు సరికొత్త సవాల్

China made Ultra Set poses new challenge for Indian defense forces

  • ఇటీవల జమ్మూకశ్మీర్ లో పలు ఎన్ కౌంటర్లు
  • ఆరుగురు ఉగ్రవాదుల వద్ద అల్ట్రా సెట్లు లభ్యం
  • అల్ట్రా సెట్ సందేశాలను పసిగట్టలేకపోతున్న భారత సైన్యం
  • వీటిని పాకిస్థాన్ సైన్యానికి అందజేసిన చైనా!

ఇటీవల జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికలు ఎక్కువయ్యాయి. కొన్ని రోజుల వ్యవధిలోనే పలు ఉగ్రవాద దాడి ఘటనలు జరిగాయి. అయితే, భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన ఉగ్రవాదుల వద్ద అత్యాధునిక టెలికమ్యూనికేషన్ పరికరం అల్ట్రా సెట్ లభ్యం కావడం చూస్తుంటే... మునుపటి పరిస్థితులు లేవన్న విషయాన్ని ఎత్తిచూపుతోంది. 

ఈ అల్ట్రా సెట్ అనేది చైనా తయారీ కమ్యూనికేషన్ పరికరం కావడం గమనార్హం. వీటిని చైనా... పాక్ సైన్యానికి అందించింది. వీటి ద్వారా శత్రు దేశాల ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలకు దొరక్కుండా సమాచారం ఇచ్చి పుచ్చుకోవచ్చు. 

ఇప్పుడీ అల్ట్రా సెట్ పరికరాలు ఉగ్రవాదుల చేతుల్లోకి రావడం భారత భద్రతా బలగాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఏప్రిల్ 25న జమ్మూకశ్మీర్ లోని సోపోర్ లో ఇద్దరు టెర్రరిస్తులు హతం కాగా... పూంచ్ జిల్లా ఎన్ కౌంటర్ లో నలుగురు విదేశీ మిలిటెంట్లు మృతి చెందారు. ఈ ఆరుగురి వద్ద అల్ట్రా సెట్లు ఉన్నాయి. 

అల్ట్రా సెట్లు ఎలా పనిచేస్తాయంటే...

ఇవి రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా పనిచేస్తాయి. అల్ట్రా సెట్లు చైనా కమ్యూనికేషన్ ఉపగ్రహానికి అనుసంధానమై ఉంటాయి. వీటిలో కాలింగ్, మెసేజింగ్ సదుపాయాలు ఉంటాయి. 

అన్ని అల్ట్రా సెట్లు పాకిస్థాన్ లో ఉండే మాస్టర్ సర్వర్ కు కనెక్ట్ అయి ఉంటాయి. సర్వర్ నుంచి సందేశాలను ఉపగ్రహానికి పంపి, ఉపగ్రహం నుంచి అల్ట్రా సెట్లకు చేరవేస్తారు. అత్యాధునికమైన టెక్నాలజీతో ఈ వ్యవస్థలను రూపొందించారు. ఈ విధమైన సందేశాలను భారత సైన్యం కూడా పసిగట్టలేకపోతోంది.

More Telugu News