Bandi Sanjay: హైదరాబాదులో చిరంజీవి నివాసానికి వచ్చిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్

Bandi Sanjay met Megastar Chiranjeevi in Hyderabad

  • చిరంజీవితో బండి సంజయ్ భేటీ
  • అన్నయ్యను కలవడం ఎప్పుడూ సంతోషదాయకమేనని వెల్లడి
  • విద్యార్థి దశ నుంచే తాను చిరంజీవి ఫ్యాన్ అంటూ ట్వీట్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నేడు హైదరాబాదులో మెగాస్టార్ చిరంజీవి నివాసానికి విచ్చేశారు. చిరంజీవితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. దీనిపై బండి సంజయ్ సోషల్ మీడియాలో స్పందించారు. 

"అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం ఎప్పుడూ సంతోషదాయకమే. చిరంజీవి గారు వినయశీలి, నా శ్రేయోభిలాషి. నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఆయన సినిమాలకు అభిమానిని" అంటూ ట్వీట్ చేశారు. చిరంజీవితో భేటీకి సంబంధించిన ఫొటోలను కూడా బండి సంజయ్ పంచుకున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే కేంద్రం నుంచి పద్మ విభూషణ్ అందుకున్న సంగతి తెలిసిందే. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి... ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 

తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన ఆయన... సాంకేతికంగా చూస్తే ఇంకా కాంగ్రెస్ లో కొనసాగుతున్నట్టే లెక్క. ఆయన ఇప్పటివరకు కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్టు ఎక్కడా ప్రకటించకపోవడమే అందుకు కారణం. 

అయితే ఆయనకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా చిరంజీవితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల, ఏపీ మంత్రివర్గ  ప్రమాణస్వీకారోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం స్వయంగా చిరంజీవి వద్దకు వెళ్లి చేయి పట్టుకుని ముందుకు తీసుకువచ్చారు.

More Telugu News