Chandrababu: అమిత్ షా ఫోన్ చేస్తే ఒక్కటే చెప్పా.. చంద్రబాబు

Union Minister Amit shah Phone Call To CM Chandrababu

  • పదవులు కాదు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశానన్న ఏపీ సీఎం
  • పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు
  • లోక్ సభ స్పీకర్ ఎంపికపై అమిత్ షా ఫోన్ చేశాడని ఏపీ సీఎం వెల్లడి
  • ఆ విషయంలో టీడీపీకి సంబంధంలేదని చెప్పినట్లు వివరణ

లోక్ సభ స్పీకర్ ఎంపికపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేశాడని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే, ఆ విషయం టీడీపీకి సంబంధంలేదని తాను స్పష్టం చేశానన్నారు. కూటమిలో కీలక పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీకి పదవులతో సంబంధంలేదని, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తేల్చిచెప్పారు. ఈమేరకు ఆదివారం జరిగిన పార్లమెంటరీ పార్టీ భేటీలో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు మాట్లాడారు. పదవుల కోసం పట్టుబడితే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని, ఈ విషయం ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. పదవులు తమకు ముఖ్యంకాదన్నారు. ఈసారి పార్లమెంట్ లో టీడీపీకి 16 ఎంపీల బలం ఉండడంతో ఏపీకి ఎక్కువ నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని చంద్రబాబు వారికి మార్గనిర్దేశం చేశారు.

ఒక్కో ఎంపీకి మూడు శాఖలు కేటాయిస్తానని, ఆ శాఖకు సంబంధించి రాష్ట్ర మంత్రితో సమన్వయం చేసుకుంటూ కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకురావాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రతీ ఎంపీ ప్రథమ ప్రాధాన్యం కావాలని పార్టీ ఎంపీలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో పోలవరం, అమరావతిల నిర్మాణం పూర్తిచేసే విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు. సోమవారం నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సభలో లేవనెత్తాల్సిన అంశాలను, అనుసరించాల్సిన వైఖరిపై ఎంపీలతో చంద్రబాబు చర్చించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలును, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా బైరెడ్డి శబరి, కోశాధికారిగా దగ్గుమళ్ల ప్రసాద్ లను చంద్రబాబు ఎంపిక చేశారు.


Chandrababu
AP CM
Amit Shah
Phone call
Parliament
TDP
Party meet

More Telugu News