T20 World Cup 2024: ఆఫ్ఘనిస్థాన్‌పై కమిన్స్ హ్యాట్రిక్.. వరుసగా రెండోసారి.. ప్రపంచకప్‌లో అరుదైన రికార్డ్

Australia Star Bowler Pat Cummins Records Another Hattrick In T20 World Cup

  • మొన్న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో వరుసగా మూడు వికెట్లు తీసిన కమిన్స్
  • తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరోమారు
  • ప్రపంచకప్‌లో వరుసగా రెండుసార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి అటగాడిగా కమిన్స్ రికార్డ్
  • ఓటమి దిశగా ఆస్ట్రేలియా

టీ20 ప్రపంచకప్ సూపర్ 8 గ్రూప్-1లో ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ స్టార్ పేసర్ పాట్ కమిన్స్ చెలరేగాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించిన ఈ పేసర్.. తాజా మ్యాచ్‌లో మరోమారు చెలరేగి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఫలితంగా టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండుసార్లు ఆ ఘనత సాధించిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.

హ్యాట్రిక్ వికెట్లు ఇలా..
18వ ఓవర్ చివరి బంతికి రషీద్‌ఖాన్‌ను అవుట్ చేసిన కమిన్స్ ఆ తర్వాతి (20వ) ఓవర్‌లో బంతితో నిప్పులు చెరిగాడు. తొలి బంతికి కరీమ్ జనత్ (13)ను అవుట్ చేసిన కమిన్స్.. తర్వాతి బంతికి గుల్బాదిన్‌ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ పంపాడు. దీంతో కమిన్స్ ఖాతాలో హ్యాట్రిక్ చేరింది. కమిన్స్ వేసిన మూడోబంతికి నంగెయలియ ఖరోటే ఇచ్చిన క్యాచ్‌ను వార్నర్ నేలపాలు చేశాడు. లేదంటే వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్ల ఘనత అతడి ఖాతాలో చేరి ఉండేది.

ఈ ఘనతతో కమిన్స్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా రెండు హ్యాట్రిక్‌లు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. లసిత్ మలింగ (శ్రీలంక), టిమ్ సౌథీ (న్యూజిలాండ్), మార్క్ పాల్వోవిక్ (సెర్బియా), వసీమ్ అబ్బాస్ (మాల్టా) టీ20ల్లో రెండుసార్లు హ్యాట్రిక్ సాధించారు. టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు 8 హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. అందులో రెండు కమిన్స్‌వే కావడం గమనార్హం. అంతేకాదు, ఆస్ట్రేలియా తరపున రెండు హ్యాట్రిక్‌లు సాధించిన ఏకైక ఆటగాడు కూడా కమిన్సే.

ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న తాజా మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమి దిశగా పయనిస్తోంది. ఆఫ్ఘాన్ నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 108 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే 24 బంతుల్లో 38 పరుగులు అవసరం కాగా, చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం పాట్ కమిన్స్, ఆష్టన్ అగర్ క్రీజులో ఉన్నారు.

More Telugu News