Nirmala Sitharaman: పెట్రోల్, డీజిల్ జీఎస్టీ కింద ఉండాలనేదే మా ఉద్దేశ్యం... కానీ..: నిర్మలా సీతారామన్
- ఒకే పన్నుపై రాష్ట్రాలు ఏకతాటిపైకి వచ్చి అంగీకరించాలని సూచన
- పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలోకి తీసుకురావడానికి కేంద్రం కట్టుబడి ఉందని వ్యాఖ్య
- ఇప్పుడు రాష్ట్రాలు పన్నురేటుపై నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్య
పెట్రోల్, డీజిల్ జీఎస్టీ కిందకు తీసుకురావాలంటే ఒకే పన్ను రేటుపై రాష్ట్రాలు ఏకతాటిపైకి వచ్చి అంగీకరించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. శనివారం 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇంధనాన్ని జీఎస్టీ కిందకు తీసుకువచ్చే అంశంపై పలు రాష్ట్రాలు ప్రశ్నించాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... దీనిని జీఎస్టీ కిందకు తీసుకు రావడానికి కేంద్రం మొదటి నుంచి కట్టుబడి ఉందన్నారు. కానీ రాష్ట్రాలు పన్ను విషయంలో ఏకతాటిపైకి రావాలన్నారు.
పెట్రోల్, డీజిల్ కూడా జీఎస్టీ కింద ఉండాలనే అరుణ్ జైట్లీ భావించారన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రాలు పన్ను రేటుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. 'అరుణ్ జైట్లీ ఉద్దేశం నాడు చాలా స్పష్టంగా ఉంది. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలోకి తీసుకురావాలని మేం కోరుకుంటున్నాం' అని నిర్మలమ్మ అన్నారు.