T20 World Cup 2024: గ్రూప్‌-2లో సెమీస్ కోసం త్రిముఖ పోరు.. స‌ఫారీల‌కు వరుసగా 6 విజయాలు.. అయినా సెమీస్ బెర్త్ డౌటే!

Thrilling three way fight for semi final spots in Group 2

  • గ్రూప్‌-2లో సెమీస్ కోసం పోటీ ప‌డుతున్న ఇంగ్లండ్‌, విండీస్‌, ద‌క్షిణాఫ్రికా
  • సూపర్- 8లో ఆడిన 2 మ్యాచుల్లో 2 విజయాలతో గ్రూప్-2లో అగ్ర‌స్థానంలో స‌ఫారీలు
  • దీంతో ద‌క్షిణాఫ్రికాకు సెమీస్ బెర్తు దాదాపు ఖాయమైనట్లే అని అంతా భావించారు
  • తాజాగా మారిన‌ స‌మీక‌ర‌ణాలతో ఆ జట్టుకు ఇంకా కన్ఫార్మ్‌కాని సెమీస్ బెర్త్

2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ద‌క్షిణాఫ్రికా జట్టు వరుస విజయాలతో అజేయంగా దూసుకుపోతోంది. గ్రూప్ ద‌శ‌లో అదరగొట్టిన సఫారీ జట్టు సూపర్-8లోనూ అదే జోరు కొనసాగిస్తోంది. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులోనూ ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధించింది. ఓట‌మి త‌ప్ప‌ద‌నే మ్యాచ్‌ను, పట్టువదలకుండా చివ‌రి వ‌ర‌కు పోరాడి స‌ఫారీలు విజయం అందుకున్నారు. దీంతో సూపర్- 8లో ఆడిన రెండు మ్యాచుల్లో రెండు విజయాలతో గ్రూప్-2లో అగ్ర‌స్థానానికి చేరింది. దీంతో ఆ జట్టుకు సెమీస్ బెర్తు దాదాపు ఖాయమైనట్లే అని అంతా భావించారు. కానీ, అదంత సులువు కాద‌ని తాజాగా మారిన‌ స‌మీక‌ర‌ణాలు చూస్తే అర్థ‌మ‌వుతోంది.

ప్రస్తుత టోర్నీలో స‌ఫారీ జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన 6 మ్యాచులకు ఆరింట్లోనూ విజయాలు నమోదు చేసినా.. సెమీస్ బెర్త్ అంత ఈజీగా కనిపించడం లేదు. తాజాగా ఇంగ్లండ్‌పై నెగ్గిన ద‌క్షిణాఫ్రికా దాదాపు సెమీస్ బెర్తు కన్ఫార్మ్ చేసుకుంది. కానీ, కొన్ని గంటల్లోనే సమీకణాలు మారాయి. శనివారం ఉదయం అమెరికాతో జరిగిన మ్యాచులో వెస్టిండీస్ భారీ విజయం నమోదు చేసింది. ఫలితంగా విండీస్ రన్రేట్ మెరుగైంది. దీంతో సూపర్- 8 గ్రూప్-2లో 4 పాయింట్లతో సౌతాఫ్రికా (+0.62) టాప్‌లో ఉండగా విండీస్ (+1.81), ఇంగ్లాండ్ (+0.41) రెండూ కూడా 2 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. దీంతో గ్రూప్-2లో ఈ మూడు జట్ల మధ్య సెమీస్ రేస్ త్రిముఖ పోరుగా మారింది.

అయితే, సూపర్- 8లో ఈ మూడు జట్లు తలో మ్యాచ్ ఆడాల్సి ఉంది. సౌతాఫ్రికా తన తదుపరి మ్యాచులో ఆతిథ్య‌ విండీస్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఇక క‌రేబియ‌న్‌ జట్టు ఈ మ్యాచును అంత తేలిగ్గా తీసుకునే అవ‌కాశం లేదు. ఇరుజట్ల మధ్య గట్టిపోటీ ఉండనుంది. సెమీస్ చేరాలంటే విండీస్‌కు ఈ పోరులో నెగ్గడం చాలా కీల‌కం. ఒకవేళ వెస్టిండీస్ నెగ్గితే 4 పాయింట్లతో పాటు ఎక్కువ రన్‌రేట్ ఉన్నందున పాయింట్ల‌ పట్టికలో ద‌క్షిణాఫ్రికా కంటే మెరుగైన స్థానానికి చేరుకుంటుంది.

ఇక ఇంగ్లండ్‌ తన తదుపరి మ్యాచ్ అమెరికాతో ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్‌కు ఇది చావోరేవో మ్యాచ్. ఈ మ్యాచులో ఇంగ్లిష్ జ‌ట్టు భారీ తేడాతో విజయం సాధిస్తే ద‌క్షిణాఫ్రికా కంటే మెరుగైన రన్‌రేట్ వస్తుంది. ఈ లెక్కన స‌ఫారీ జ‌ట్టుపై విండీస్, అమెరికాపై ఇంగ్లండ్‌ నెగ్గితే ద‌క్షిణాఫ్రికా మూడో స్థానానికి పడిపోతుంది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. ఇలా జరగడం అసాధ్యమేమీ కాదు. అందుకే ఈ సమీకరణాలతో ద‌క్షిణాఫ్రికా సెమీస్ బెర్తు ఇంకా వెయిటింగ్‌లోనే ఉన్నట్లు కనిపిస్తోంది.

సఫారీల ముందు అదొక్కటే దారి..
అయితే ఎలాంటి సమీకరణాలపైనా ఆధారపడకుండా ద‌క్షిణాఫ్రికా సెమీస్ చేరాలంటే విండీస్‌తో మ్యాచులో కచ్చితంగా గెల‌వాల్సిందే. ఈ మ్యాచులో నెగ్గితే సమీకరణాలతో ఎలాంటి పనిలేకుండా సఫారీ జట్టు నేరుగా సెమీస్‌కు చేరుతుంది. మరో మ్యాచులో ఇంగ్లండ్‌ ఎంత భారీ తేడాతో గెలిచినా సఫారీ సెమీస్ బెర్తుకు ఎలాంటి ప్రమాదం ఉండదు. నిజానికి సెమీఫైన‌ల్స్‌కు చేరేందుకు గ్రూప్- 2లో ద‌క్షిణాఫ్రికా జట్టుకే కాస్త అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ, చివ‌రి వ‌ర‌కు ఏం జరుగుతుందో తెలియ‌దు.

  • Loading...

More Telugu News