Atchannaidu: ఆనాడు అయ్యన్న ఏ పరిస్థితుల్లో ఎంపీగా పోటీ చేశారో చెప్పిన అచ్చెన్నాయుడు

Atchannaidu hails AP Assembly Speaker Ayyanna Patrudu

  • ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు
  • అయ్యన్నకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అచ్చెన్నాయుడు
  • అయ్యన్న అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారని వెల్లడి

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో అయ్యన్నపాత్రుడు స్పీకర్ స్థానాన్ని అధిష్ఠించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడికి మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. 

"16వ శాసనసభ స్పీకర్ గా, మా ఉత్తరాంధ్ర నుంచి 5వ స్పీకర్ గా ఎన్నికైన మీకు ప్రజల తరఫున, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసుల తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. 

స్వాతంత్ర్యం వచ్చాక, పరిపాలన కొన్ని వర్గాలకే పరిమితమైన తరుణంలో... 1982లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ అని టీడీపీ వ్యవస్థాపన రోజే చెప్పారు. బలహీన వర్గాలే పునాదులుగా ఏర్పడిన పార్టీ అని చెప్పడమే కాకుండా, బలహీన వర్గాలకు అవకాశమిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాను. 

అందులో భాగంగానే... బలహీన వర్గాలకు చెందిన అయ్యన్నపాత్రుడు అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ అవకాశం ఇచ్చింది ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ. మీ 42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అనేక పదవులు చేపట్టారు. ఆ రోజు ఎన్టీఆర్ మాట అయినా, ఇవాళ చంద్రబాబు మాట కానీ జవదాటలేదు. పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా, పార్టీ ఏ అవకాశం ఇచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకుని మీరు పాలన అందించారు. 

మీరు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 4 పర్యాయాలు మంత్రిగా చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీకి ఓ సంగతి చెప్పాలి. ఓ విషయం నాకు బాగా గుర్తుంది. అది 1996లో. అప్పటికి నేనింకా ఎమ్మెల్యే కాలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి బాధ్యతలు స్వీకరించాక, పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో అయ్యన్న మంత్రిగా ఉన్నారు. 

ఆ సమయంలో మంత్రులుగా ఉన్నవారిని ఎంపీలుగా పోటీ చేయాలని కోరితే, వారిలో చాలామంది అందుకు ఒప్పుకోలేదు. మంత్రి పదవి వదిలి వెళ్లడానికి వారు అంగీకరించలేదు. కానీ, అయ్యన్న మాత్రం ముందుకువచ్చారు. ఎంపీగా నేను వెళతాను అని చెప్పి, 1996లో అధినేత మాటకు జవదాటకుండా గౌరవం ఇచ్చిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు అని గర్వంగా చెప్పగలను" అంటూ అయ్యన్నపాత్రుడి గురించి వివరించారు. 

అయ్యన్న స్పీకర్ పదవికి విశేషమైన గుర్తింపు తీసుకువస్తారన్న నమ్మకం ఉందని, ఏ పదవి ఇచ్చినా న్యాయం చేసే వ్యక్తి అయ్యన్న అని కొనియాడారు.

More Telugu News