Babar Azam: మాజీ క్రికెట‌ర్ల‌పై చట్టపరమైన చర్యల‌కు రెడీ అవుతున్న పాక్ కెప్టెన్‌ బాబ‌ర్ ఆజ‌మ్‌!

Babar Azam Likely To Take Legal Action vs Ahmed Shehzad and Others

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో దారుణంగా విఫ‌ల‌మైన పాకిస్థాన్
  • గ్రూపు ద‌శ నుంచే ఇంటిముఖం ప‌ట్టిన వైనం
  • ఈ నేప‌థ్యంలో సార‌ధి బాబ‌ర్‌పై నోరుపారేసుకున్న ప‌లువురు పాక్‌ మాజీ క్రికెట‌ర్లు, యూట్యూబర్లు  
  • విమర్శల ఆధారాలు సేక‌రించే పనిలో వున్న  పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు చెందిన న్యాయ‌శాఖ  

అమెరికాలో జ‌రుగుతున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో దాయాది పాకిస్థాన్ దారుణంగా విఫ‌ల‌మైంది. దాంతో ఆ జ‌ట్టు గ్రూప్ ద‌శ‌లోనే నిష్క్ర‌మించింది. సూప‌ర్‌-8 ద‌శ‌కు చేర‌కుండానే ఇంటికి ప‌య‌న‌మైంది. అంతే.. ఆ జ‌ట్టుపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇక పాక్ జ‌ట్టు సార‌ధి బాబ‌ర్ ఆజంపై చాలా మంది మాజీ క్రికెట‌ర్లు నోరుపారేసుకున్నారు. అత‌ని ప్ర‌వ‌ర్త‌న వ‌ల్లే జ‌ట్టు త‌దుప‌రి ద‌శ‌కు చేరుకోలేక‌పోయిన‌ట్లు ఆరోపించారు. గ‌తంలో బాబ‌ర్‌తో ఆడిన అహ్మ‌ద్ షెహ‌జాద్‌తో పాటు యూట్యూబ‌ర్లు కూడా విమ‌ర్శ‌ల‌తో చెల‌రేగిపోయారు. 

ఈ నేప‌థ్యంలో వారంద‌రిపై న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌దేప‌దే త‌న‌ను టార్గెట్ చేయ‌డం బాబ‌ర్‌ను నిరుత్సాహపరిచింది. అత‌ను ఎంతో మ‌నో వేద‌న‌కు గురైన‌ట్లు కూడా తెలుస్తోంది.

మరోపక్క, యూట్యూబ‌ర్లు, మాజీ క్రికెట‌ర్ల చేసిన విమర్శలకు చెందిన కామెంట్ల‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు చెందిన న్యాయ‌శాఖ సేక‌రిస్తున్న‌ట్లు స‌మాచారం. అన్ని కోణాల్లో కామెంట్ల‌ను సేక‌రించిన త‌ర్వాత పాక్ బోర్డు న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించ‌నుంది. మ‌రో వైపు అమెరికాలో ఉన్న పాక్ క్రికెట‌ర్లు కొంద‌రు లాహోర్ చేరుకున్నారు. 

ప్రైవేటు ఎయిర్‌లైన్స్ ద్వారా వాళ్లు అల్ల‌మా ఇక్బాల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టుకు వ‌చ్చారు. న‌సీమ్ షా, ఉస్మాన్ ఖాన్‌, వాహ‌బ్ రియాజ్ ఇంటికి వ‌చ్చేశారు. బాబ‌ర్‌, ఇమాద్ వాసిమ్‌, హ‌రీశ్ రౌఫ్‌, షాదాబ్ ఖాన్‌, ఆజ‌మ్ ఖాన్‌లు ఇంకా అమెరికాలోనే ఉన్నారు. వీరు శనివారం స్వ‌దేశానికి బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ నుంచి నిష్క్ర‌మించిన త‌ర్వాత మాజీ తోటి స‌భ్యుడు అహ్మ‌ద్‌ షెహ‌జాద్ పాక్ సార‌ధిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశాడు. దీంతో అత‌నిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బాబ‌ర్ ఆలోచిస్తున్న‌ట్లు తెలిసింది.

ఇక గత ఎడిషన్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ పోటీల్లో పాక్ ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్స్‌లో త‌ల‌ప‌డింది. కానీ, ఈసారి పాకిస్థాన్ గ్రూప్ దశలోనే నిష్క్రమించడం ఆ దేశ మాజీ ఆట‌గాళ్ల‌తో పాటు అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. గ్రూప్‌-ఏలో పాక్‌తో పాటు ఉన్న అమెరికా, భార‌త్ సూప‌ర్‌-8కి దూసుకెళ్లాయి. 

ఇదిలాఉంటే.. నవంబర్‌లో పాకిస్థాన్ త‌న తదుపరి వైట్ బాల్ సిరీస్‌ను ఆస్ట్రేలియాతో ఆడ‌నుంది. ఈ సిరీస్‌లో మెన్ ఇన్ గ్రీన్ మూడు వ‌న్డేలు ఆడుతుంది. ఇది నవంబర్ 4 న ప్రారంభమవుతుంది.

  • Loading...

More Telugu News