Bommidi Narayana Nayakar: మత్స్యకారుడి వేషధారణలో అసెంబ్లీకి జనసేన ఎమ్మెల్యే.. అసలు కారణం ఇదేనట.. వీడియో ఇదిగో!
- నరసాపురం నుంచి విజయం సాధించిన నారాయణ నాయకర్
- చేపల వల, బుట్టతో అసెంబ్లీకి ఎమ్మెల్యే
- వచ్చే ఐదేళ్లు మత్స్యకారులకు అండగా ఉంటానని చెప్పేందుకే ఈ వేషధారణ అని వివరణ
జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ నిన్న మత్స్యకారుడు వేషధారణతో అసెంబ్లీకి వచ్చారు. ఎమ్మెల్యేల్లో ప్రత్యేకంగా కనిపించిన ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. మత్స్యకార సామాజికవర్గానికి చెందిన ఆయన ఇటీవలి ఎన్నికల్లో నరసాపురం నుంచి జనసేన తరపున పోటీచేసి విజయం సాధించారు.
జాలరి వేషధారణలో వచ్చిన ఆయనను తొలుత ఎవరూ గుర్తించలేదు. చేతిలో వల, చేపలబుట్ట పట్టుకుని అసెంబ్లీ గేటు వరకు నడుచుకుంటూ వచ్చారు. ఆయన ఎమ్మెల్యే అని గుర్తించిన తర్వాత ఆయన వేషధారణ వెనకున్న కారణాన్ని విలేకరులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు.
రాష్ట్రంలో 970 కిలోమీటర్ల తీరప్రాంతం ఉందని, అయినప్పటికీ మత్స్యకారుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తంచేశారు. రానున్న ఐదేళ్లు వారికి అండగా ఉంటానని చెప్పేందుకే ఈ వేషధారణలో వచ్చినట్టు నాయకర్ వివరించారు.