Sajjanar: బస్సు కింద పడుకొని స్టంట్ చేసినట్లుగా ఫేక్ వీడియో... సజ్జనార్ ఆగ్రహం

Sajjanar fires at viral video

  • సోషల్ మీడియాలో పాప్యులర్ కావడానికి ఇలాంటి వీడియోలు ఎడిట్ చేసి వదులుతున్నారని ఆగ్రహం
  • లైక్‌‌లు, కామెంట్ల కోసం చేసే పనులను ఇతరులు అనుకరించే ప్రమాదం ఉంటుందని హెచ్చరిక
  • ఇలాంటి వాటిని టీజీఆర్టీసీ సీరియస్‌గా తీసుకుంటుందని స్పష్టీకరణ

ఆర్టీసీ బస్సు కింద పడుకొని స్టంట్ చేసినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, ఈ వీడియో ఫేక్‌దిగా చెబుతున్నారు. గ్రీన్ మ్యాట్‌లో ఈ వీడియోను చిత్రీకరించి... బస్సు కింద పడుకున్నట్లుగా ఎడిట్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి వీడియోను తయారు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 

ఈ క్రమంలో, రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఈ వీడియో ఫేక్ అని ఆయన కూడా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పాప్యులర్ కావడానికి ఇలాంటి వీడియోలను ఎడిట్ చేసి వదులుతున్నారని... ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం సరికాదని మండిపడ్డారు. లైక్‌‌లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా అనాలోచిత పనులను ఇతరులు అనుకరించే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. కొందరు తమ సరదా కోసం ఇలాంటి వీడియోలను ఎడిట్ చేసి షేర్ చేస్తే, వాటి కారణంగా ఇతరులు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి ఘటనలను టీజీ ఆర్టీసీ సీరియస్‌గా తీసుకుంటుందని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

More Telugu News