Amaravati Railway Line: అమరావతికి కొత్తకళ.. రైల్వేశాఖ ఉరుకులు పరుగులు!
- అమరావతి రైల్వే లైన్ భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల
- గతంలోని నిబంధనలు కూడా తీసేసి సొంతంగానే నిర్మాణానికి ముందుకొచ్చిన రైల్వేశాఖ
- ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య భూ సేకరణ
- విజయవాడ-హైదరాబాద్ లైన్‌లో ఎర్రుపాలెం వద్ద కొత్త లైన్ మొదలు
ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు తిరిగి బాధ్యతలు స్వీకరించాక రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు మూలకు వెళ్లి, దాదాపు అందరూ మర్చిపోయిన అమరావతి మళ్లీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఏపీ రాజధానిగా అమరావతి కొత్త కళ సంతరించుకుంది. ఇక ఇప్పుడు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
గతంలో అమరావతికి రైల్వే లైను ప్రతిపాదన ఉండగా, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది అటకెక్కింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ నేతృత్వంలో కూటమి అధికారంలోకి రావడంతో రైల్వేశాఖ ఆగమేఘాల మీద స్పందించింది. అమరావతి రైల్వే లైన్ భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. రైల్వే లైనుకు రాష్ట్రం తన వాటా ఇవ్వాలని, భూసేకరణ వ్యయం భరించాలంటూ గతంలో బోల్డన్ని నిబంధనలు పెట్టిన రైల్వే.. ఇప్పుడు ఎలాంటి నిబంధనలు పెట్టకుండానే భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేయడం గమనార్హం. పూర్తిగా సొంత నిధులతోనే అమరావతికి రైల్వే లైన్ నిర్మించాలని నిర్ణయించింది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య భూ సేకరణకు వీలుగా ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అమరావతి ప్రధాన స్టేషన్‌గా 9 స్టేషన్‌లు
విజయవాడ-హైదరాబాద్ లైన్‌లో ఎర్రుపాలెం వద్ద కొత్త లైన్ మొదలై అమరావతి మీదుగా గుంటూరు-విజయవాడ లైన్‌లోని నంబూరు వద్ద కలుస్తుంది. ఎర్రుపాలెం తర్వాత పెద్దాపురం, చిన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరులలో మొత్తం 9 స్టేషన్లు నిర్మిస్తారు. వీటిలో పెద్దాపురం, పరిటాల, అమరావతి, కొప్పురావూరు పెద్ద స్టేషన్లు. వీటిలోనూ అమరావతి ప్రధాన స్టేషన్‌గా ఉంటుంది. ఈ లైన్‌లో భాగంగా కృష్ణానదిపై కొత్తపేట-వడ్డమాను మధ్య 3 కిలోమీటర్ల వంతెన నిర్మిస్తారు.