Narendra Modi: చైనా అభ్యంతరాలను ఖాతరు చేయని ప్రధాని మోదీ!
- దలైలామాతో అమెరికా చట్టసభసభ్యుల బృందం సమావేశం
- ఈ సమావేశంపై చైనా తీవ్ర అభ్యంతరం
- అనంతరం, అమెరికా బృందంతో మోదీ భేటీ
- చైనా అగ్రహం వ్యక్తం చేస్తున్నా ఖాతరు చేయని వైనం
చైనా అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ.. దలైలామాతో సమావేశమైన అమెరికా చట్టసభ సభ్యుల బృందంతో గురువారం భేటీ అయ్యారు. మూడోసారి ప్రధానిగా ఎన్నికైన మోదీకి అమెరికా చట్టసభ సభ్యులు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామిక దేశంలో భారీ స్థాయిలో అత్యంత పారదర్శకంగా, న్యాయబద్ధంగా ఎన్నికలు జరగడంపై వారు అభినందనలు తెలియజేసినట్టు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాల మధ్య సంబంధం అత్యంత ప్రభావశీలమైనదని అమెరికా చట్టసభ సభ్యులు వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక ప్రపంచస్థాయి భాగస్వామ్యం మరింత బలపడాలని ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో ఇరు దేశాలు సహకరించుకోవాలని నిర్ణయించారు. ఈ భాగస్వామ్యం బలపరచడంలో అమెరికా కాంగ్రెస్ పాత్రను కూడా మోదీ కొనియాడారు. చట్టబద్ధమైన పాలన, ప్రజల మధ్య బంధాల పునాదిగా ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధం ఏర్పడిందని వ్యాఖ్యానించారు.
అంతకుమునుపు, అమెరికా కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ మైఖేల్ మెక్కాల్, మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ నేతృత్వంలోని బృందం టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాతో ధర్మశాలలో సమావేశమయ్యారు. అనంతరం, తిరిగొచ్చిన వారికి భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ అమెరికా-భారత్‌ల బంధం దృఢమైనదని అన్నారు. అయితే, తమకు అమెరికా మద్దతు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.
మరోవైపు, దలైలామాతో అమెరికా చట్టసభ సభ్యుల సమావేశంపై చైనా భగ్గుమంది. దలైలామా వేర్పాటువాద భావజాలాన్ని మర్చిపోవద్దని హెచ్చరించింది. టిబెట్‌పై తమకు ఇచ్చిన హామీని గౌరవించాలని స్పష్టం చేసింది. టిబెట్ విషయంలో ప్రపంచానికి తప్పుడు సంకేతాలు పంపొద్దని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మోదీ సమావేశం కూడా చైనాకు ఆగ్రహం తప్పక తెప్పిస్తుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.