Sharad Pawar: లోక్ సభలో ప్రతిపక్ష నేత ఎవరనేది కాంగ్రెస్ నిర్ణయిస్తుంది: శరద్ పవార్
- కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుందన్న శరద్ పవార్
- అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఒప్పందం కుదిరిందన్న పవార్
- కాంగ్రెస్ నిర్ణయం తర్వాత కూటమి ఆమోదం అవసరమని వ్యాఖ్య
లోక్ సభలో ప్రతిపక్ష నేత ఎవరనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుందని ఎన్సీపీ (శరద్ పవార్) అధినేత శరద్ పవార్ అన్నారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్‌కే అత్యధిక సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కూటమిలో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీకి చెందిన నేతకు లోక్ సభలో ప్రతిపక్ష నేత హోదాను ఇవ్వాలని గతంలో తమ మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు వచ్చాయని... ఈ నేపథ్యంలో ఎవరు ఆ హోదాలో ఉంటారనేది ఆ పార్టీనే నిర్ణయిస్తుందన్నారు. ఆ తర్వాత కూటమి సభ్యుల ఆమోదం కూడా అవసరమే అన్నారు.
లోక్ సభ డిప్యూటీ స్పీకర్‌గా ఎవరైనా ప్రతిపక్ష నేత ఉండేలా ప్రయత్నాలు చేస్తారా? అని ప్రశ్నించగా, శరద్ పవార్ స్పందిస్తూ... గతంలో రెండు పర్యాయాలు ప్రధాని మోదీ ఈ నియమాన్ని పాటించలేదన్నారు. ఈ అంశంపై చర్చ జరిగినా సానుకూల ఫలితం వస్తుందని అయితే తాము భావించడం లేదన్నారు. మహారాష్ట్రలో తమ కూటమి మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు. ప్రధాని మోదీపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. ఆయన హామీలు నకిలీవి అని తేలాయన్నారు.