Cricket: బాల్కనీ నుంచి పడి మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ మృతి... ఆత్మహత్యగా అనుమానం!

Former India quick David Johnson passes away

  • బెంగళూరులో నాలుగో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందిన డేవిడ్ జాన్సన్
  • తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రిలో చేరిక
  • చికిత్స పొందుతూ మృతి చెందిన మాజీ క్రికెటర్

నాలుగో అంతస్తులోని బాల్కనీ నుంచి కిందపడి భారత మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ మృతి చెందారు. ఆయన వయస్సు 52 సంవత్సరాలు. జాన్సన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. టీమిండియా తరఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడనప్పటికీ... దేశవాళీలో మాత్రం అతని పేరు సుపరిచితం. బెంగళూరులోని తన ఇంటి బాల్కనీ నుంచి కిందపడటం వల్ల ఆయన తీవ్రంగా గాయపడి... ఆసుపత్రిలో చేరారు.

డేవిడ్ జాన్సన్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం వెల్లడించింది. అయితే ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అపార్టుమెంట్‌లోని నాలుగో ఫ్లోర్‌లో ఆయన ఉంటున్నాడు. బాల్కనీ నుంచి కిందపడిపోయినట్లు సమాచారం అందడంతో వెంటనే ఆసుపత్రికి తరలించామని, కానీ ఆయన మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని క్రికెట్ సంఘం ప్రకటించింది.

జాన్సన్ తాను ఉండే ఇంటికి సమీపంలో ఓ కోచింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. అది సరిగ్గా నడవకపోవడంతో నష్టాలు వచ్చాయని భావిస్తున్నారు. దీంతో జాన్సన్ మానసికంగా దెబ్బతిన్నారని... దీనికితోడు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడి పరిస్థితులు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లుగా కనిపిస్తోందని పోలీసు అధికారులు చెబుతున్నారు. 

డేవిడ్ జాన్సన్ భారత్ తరఫున రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడారు. 39 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లకూ ప్రాతినిథ్యం వహించారు. కర్ణాటక క్రికెట్ సంఘం బౌలింగ్ యూనిట్‌లో కీలక పాత్ర పోషించారు. మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్, దొడ్డ గణేశ్ తదితరులతో కలిసి ఆడారు.

  • Loading...

More Telugu News