Chandrababu: ఇవాళ నా మనసంతా బాధతో నిండిపోయింది: సీఎం చంద్రబాబు

CM Chandrababu press meet after Amaravati visit

  • ఇటీవల ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు
  • నేడు అమరావతిలో పర్యటన
  • సగంలోనే నిలిచిపోయిన నిర్మాణాల పరిశీలన
  • తీవ్ర ఆవేదనతో ప్రెస్ మీట్ నిర్వహించిన చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని, రాజధానిలో వివిధ నిర్మాణాలను నేడు పరిశీలించారు.  అమరావతి రాజధాని శిలాఫలకం, సీడ్ యాక్సెస్ రోడ్డు, ఆలిండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయాలు, మంత్రులు, జడ్జిల గృహ సముదాయాలు, ఐకానిక్ నిర్మాణాల సైట్లు, రాజధాని ప్రాంతంలోని ఇతర నిర్మాణాల స్థితిగతులను చంద్రబాబు పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధాని రైతులకు నమస్కారాలు తెలిపారు. "అమరావతి రైతులు 1,631 రోజులుగా ఆందోళనలు చేపట్టి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతో ఆందోళనలు విరమించారు. ఇక్కడి రైతులు చేపట్టిన ఉద్యమం ప్రపంచంలో ఒక చరిత్ర. ఒక రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత ఇక్కడుండే రైతులకే దక్కుతుంది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. మీరు పోరాడిన తీరు భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. 

అమరావతి అనగానే ప్రపంచం అంతా గుర్తించే పరిస్థితికి వచ్చారు. ఐదు కోట్లమంది ప్రజలకు దశ, దిశ నిర్దేశించే రాజధానిగా, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని అనుకున్నాం. అలాంటి రాజధానిని అతలాకుతలం చేశారు. పోలవరంను కూడా నాశనం చేశారు. 

దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీళ్లు ఉండే నది గోదావరి. పోలవరం పూర్తి చేసి, నదులు అనుసంధానం చేయగలిగితే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే వీలుంటుంది. నాడు రాష్ట్ర విభజన జరిగితే, హేతుబద్ధత లేదని పోరాడాం. బలమైన ఆర్థిక నగరం హైదరాబాద్ తెలంగాణకు వెళుతుంది... పోలవరం పూర్తి చేస్తే ఈ రాష్ట్రానికి కొంతవరకు వెసులుబాటు వస్తుందన్న ఉద్దేశంతో అమరావతిని, పోలవరం ప్రాజెక్టును విభజన చట్టంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, అమరావతి రాజధానికి ఆర్థికసాయం చేసేందుకు నాడు కేంద్రం ముందుకు వచ్చింది. అయితే, వైసీపీ ప్రభుత్వం ఈ రెండింటిని భ్రష్టు పట్టించింది. 

ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక విజయం అందించారు. ఇలాంటి ముఖ్యమంత్రి మాకు అవసరం లేదని ప్రజలు ఏకపక్షంగా బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. వీళ్లకు 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఒక నియోజకవర్గంలో మాకు 95 వేల మెజారిటీ వచ్చింది. దుష్ట పరిపాలనకు ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో దీన్ని బట్టే అర్థమవుతుంది. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, ముఖ్యమంత్రిగా అర్హత లేని వ్యక్తికి ఆ పదవి వస్తే ఏం జరుగుతుందో ఐదేళ్ల పాటు మనం చూశాం. 

అమరావతి, పోలవరం ఎవరి వ్యక్తిగత సంపద కాదు. ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. అమరావతి అనేది ఒక సంపదను సృష్టించే కేంద్రం. సంపదను సృష్టిస్తే అది సమాజానికి పనికొస్తుంది. అదే సమయంలో వ్యక్తులు బాగుపడతారు, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రజలను సాధికారత దిశగా ముందుకు నడిపించడం సాధ్యమవుతుంది. 

కేంద్రం నిధులతో నిర్మించే పోలవరంను పూర్తి చేసుకోగలిగితే, రాళ్ల సీమ రాయలసీమను కూడా సస్యశ్యామలం చేయొచ్చు. మొన్ననే పోలవరం వెళ్లొచ్చాను. అక్కడ ఇప్పుడు ఏం చేయాలన్నా నాలుగైదేళ్ల సమయం పట్టే పరిస్థితి ఉంది. ఖర్చులు  కూడా రెట్టింపయ్యాయి. రాష్ట్రానికి ఒక వరంలా ఉండాల్సిన పోలవరం ఒక వ్యక్తి మూర్ఖత్వం వల్ల ఇవాళ ఒక శాపంలా మారిపోయింది. 

ఇవాళ అమరావతిలో పర్యటించాను. నేరుగా ప్రజావేదిక వద్దకు వెళ్లాను. ఎవరైనా ముఖ్యమంత్రి అయితే ఒక మంచి కార్యక్రమంతో ప్రజలను మెప్పించేందుకు ప్రయత్నిస్తారు. కానీ అతడు ప్రజావేదిక కూల్చి అక్కడ్నించి పరిపాలన ప్రారంభించాడు. 

ఇక, ప్రజావేదిక నుంచి నేరుగా రాజధాని నిర్మాణానికి నాడు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వచ్చాను. రాష్ట్రంలోని ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క వార్డు నుంచి, అక్కడుండే దేవాలయాల నుంచి పవిత్రమైన మట్టిని, నదుల నుంచి పవిత్రమైన నీటిని తీసుకువచ్చాం. చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు చేశారు. సాక్షాత్తు ప్రధాని పార్లమెంటు నుంచి పవిత్రమైన మట్టిని, యమునా నది నుంచి పవిత్ర జలాలను తీసుకురావడం ద్వారా తమ సంఘీభావం తెలియజేశారు. ఆ మహిమే ఇవాళ మనల్ని కాపాడిందని నాకు అనిపిస్తోంది. తాత్కాలికంగా కొందరు ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేయాలనుకున్నా, ఈ స్థల మహత్మ్యం వల్ల తిరిగి నిలబెట్టుకోగలిగాం. 

నాడు శంకుస్థాపన చేసిన పవిత్రమట్టిని ఇక్కడుండే రైతులు నేటి వరకు కాపాడారు. నాడు యజ్ఞం చేసిన యజ్ఞశాలను కూడా నేడు సందర్శించాను. 1631 రోజుల పాటు ఉద్యమం సాగించిన మహిళలు యజ్ఞశాలను పరిరక్షించారు. అక్కడ్నించి నేరుగా భవన నిర్మాణాల వద్దకు వెళ్లాను. ఈ ఐదేళ్లలో ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది. వీళ్లు చేసిన పని... వీలైతే విధ్వంసం చేశారు, ఇక్కడుండే పైపులను దొంగిలించుకుని వెళ్లారు, ఇసుక దొంగిలించుకుపోయారు, చివరికి రోడ్లు వేస్తే మెటల్ కూడా తవ్వుకుని పోయారు. దీన్ని ఏమనాలో నాకు అర్థం కావడంలేదు. వీళ్లు ఒక్క బిల్డింగ్ ను కూడా పట్టించుకోలేదు. 

అయితే, ఆ రోజు కట్టిన అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు బిల్డింగ్ లు మాత్రం ఉన్నాయి. ఇవాళ నా పర్యటనలో వీటన్నింటి వద్దకు తిరిగిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. రోడ్లు సగంలో ఆగిపోయాయి, కొన్ని రోడ్లు 80 శాతం పూర్తి అయి ఆగిపోయాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండే క్వార్టర్స్ కు వెళితే, 70-80 శాతం పని పూర్తయింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మిగిలిన పని నిలిచిపోయింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల భవనాలు, ప్రిన్సిపల్ సెక్రటరీల భవనాల వద్ద తుమ్మ చెట్లు మొలిచి మొత్తం కమ్ముకుపోయాయి. 

అడ్మినిస్ట్రేషన్ కోసం ఐదు టవర్ బిల్డింగ్ ల నిర్మాణం చేపట్టాం. ఇంకో పక్కన అసెంబ్లీ బిల్డింగ్, దాని పక్కనే హైకోర్టు, పక్కనే జడ్జిల బంగ్లాలు, ఆ పక్కన మంత్రుల బంగ్లాలు, ఎమెల్యేల నివాస సముదాయాలు, గెజిటెడ్ ఆఫీసర్స్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ వస్తాయి. ఇవన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత... ఏ విధంగా ఉండాల్సిన రాజధాని ఎలా తయారైందో కదా అని ఎంతో బాధగా అనిపించింది.

నాడు మేం అమరావతి ఏ విధంగా ఉండాలని ప్రణాళిక రూపొందించామో దానిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తాం. అందులో వివరాలన్నీ పొందుపరుస్తాం. ఇవాళ నేను ఈ పర్యటన చేపట్టింది... రాజధాని ఎక్కడి వరకు ఆగిపోయిందో, ఏ స్థాయిలో ఉందో అధ్యయనం చేయడానికి వచ్చాను. ఇక్కడి రైతుల నుంచే కాదు, రాష్ట్రంలోని ప్రజలందరి నుంచి సూచనలు తీసుకుంటాం. ఇది ఏ ఒక్కరి కోసమో కట్టే రాజధాని కాదు. ఇది ప్రజా రాజధాని. భావితరాల భవిష్యత్ కోసం కట్టే రాజధాని. తెలుగుజాతి గౌరవంగా, గర్వంగా తలెత్తుకుని తిరిగే రాజధాని. 

ఇక్కడ అమరావతి రాజధానిగా వస్తుందంటే, అక్కడ విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలని, కర్నూలును ఒక ఆధునిక నగరంగా చేయాలని భావించాం. అదే సమయంలో అన్ని జిల్లా కేంద్రాలను ఎలా అభివృద్ధి చేస్తామో కూడా స్పష్టంగా చెప్పాం. కేంద్రం 12 సంస్థలను ఇస్తే, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీ పెట్టాం. అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, తిరుపతిలో ఐసెర్, ఐఐటీ ఏర్పాటు చేశాం. విశాఖలో ఐఐఎం, తాడేపల్లిగూడెంలో ఎన్ఐఐటీ తీసుకువచ్చాం. మంగళగిరిలో ఎయిమ్స్, విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ పెట్టాం. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ఆరోజే స్పష్టమైన ప్రణాళిక తీసుకువచ్చాం. కానీ ఇవాళ చూస్తే ఏదీ జరిగే పరిస్థితి లేకుండా పోయింది. 

కానీ, నా బాధ ఏంటంటే... ఈ రాజధానిపై బురద చల్లే ప్రయత్నం చేశారు. నిత్యం విష ప్రచారం చేశారు. అమరావతి బ్రాండ్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. నాడు రాజధాని కమిటీ ఏదైనా సెంటర్ గా ఉండే ప్రాంతంలో రాజధాని పెట్టాలని చెప్పింది. ఆ విధంగా అమరావతిని రాజధాని పెట్టాం. అటు 12 పార్లమెంటు స్థానాలు, ఇటు 12 పార్లమెంటు స్థానాలు... మధ్యలో గుంటూరు ప్రాంతం ఉంటుంది. ఎలిమెంటరీ స్కూల్లో చదివే పిల్లాడిని అడిగినా ఠక్కున చెప్పేలా ఉంటుంది ఈ రాజధాని. 

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అన్నారు. స్విస్ చాలెంజ్ విధానాన్ని అవహేళన చేశారు. సింగపూర్ కన్సార్టియంపై విషం చిమ్మి తరిమేశారు. అగ్రగామి కన్సల్టెంట్ సంస్థ నార్మన్ ఫాస్టర్ ను పంపించివేశారు. ఆ తర్వాత మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు... ఇప్పుడు మన రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితిలోకి నెట్టేశారు. ఇంత పెద్ద రాజధాని కట్టడానికి డబ్బులెక్కడ ఉన్నాయి? అన్నారు. 

రైతులు ఇచ్చిన భూములే కాకుండా, ఇక్కడ ఉండే ప్రభుత్వ భూములను కూడా కలుపుకుంటే ఆనాడు 55 వేల ఎకరాలు సేకరించాం. 29 వేల మంది రైతులు ఒక్కరు కూడా కోర్టుకు వెళ్లకుండా, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాజధానికి భూములు ఇచ్చారు. దీనిపై ఎన్ని అపవాదులు వేయాలో అన్నీ వేశారు. ఇక్కడ ఉండే రైతాంగాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారు. ఇక్కడ ఉండే కామన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను ఉపయోగించుకుని, రోడ్లు, ప్రభుత్వ భవనాలు, ప్రజా సంబంధ అవసరాలకు ఉపయోగించుకుని, మిగిలిన భూమిని అమ్మితే రాజధాని కట్టేందుకు డబ్బు వస్తుంది. దానిపై కూడా ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం చేశారు. 

అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని నేను మొదటి నుంచి చెబుతున్నాను. ఇక్కడ వచ్చే ఆదాయమే అమరావతి నిర్మాణానికి సరిపోతుంది. ఎప్పటికప్పుడు నిర్మాణాలు జరిగి, ఆర్థిక కార్యక్రమాలు జరిగితే దాని వల్ల  ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టే వెసులబాటు కలుగుతుందని చెప్పాం. కానీ ఏది చెప్పినా... ఒక దురుద్దేశం మనసులో పెట్టుకుని ఈ రాజధానిని నిర్వీర్యం చేశారు, అపహాస్యం చేశారు, ధ్వంసం చేశారు. 

ఇదీ నేను ఇవాళ విస్తృతస్థాయిలో గమనించిన అంశం. మీడియా కూడా చూసింది. కొన్ని భవనాలు బూజుపట్టిపోయాయి, తలుపులు పాడైపోయాయి. కొన్ని తలుపులు విరగ్గొటారు. ఎన్ని సాంఘిక వ్యతిరేక కార్యకలాపాలు చేయాలో అన్నీ చేశారు. కాంట్రాక్టర్లు తరలించిన మెటీరియల్ ను కూడా దోచుకుని వెళ్లారు. ఇదేమని అడిగితే వాళ్లను కూడా కొట్టే పరిస్థితికి వచ్చారు. ఇంత దారుణం, దౌర్జన్యం ఎక్కడా లేవు. 

ఏదేమైనా మళ్లీ అమరావతిని గాడినపెడతాం. ముందు రాజధానిలో పెరిగిన తుమ్మ చెట్లన్నీ తొలగిస్తే కానీ ఎక్కడ ఏముందో తెలిసే పరిస్థితి లేదు. ఈ లోపు ప్రజలతో చర్చించి ఏం చేయాలో ఆలోచిస్తాం. ఒక దుర్మార్గమైన వ్యక్తి విధ్వంసానికి అమరావతి బలైపోయింది. వీళ్లకు 11 సీట్లే వచ్చాయి. ఆ పార్టీకి ఓటేసిన వాళ్లను ఒకటే అడుగుతున్నా... ఇలాంటి వ్యక్తికి ఓటేయడం భావ్యమా? ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హులా? ఇలాంటి వాళ్లను మనం ప్రోత్సహిస్తామా? ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉంటే ప్రజా భవిష్యత్తు  ఏమవుతుంది? అనే అంశాలను ప్రజలు అర్థం చేసుకోవాలి. 

అమరావతితో మాకేం సంబంధం, పోలవరంతో మాకేంటి సంబంధం, అభివృద్ధి అంటే అదేంటి? అని కొందరు అనుకోవచ్చు... కానీ అలాంటి ఆలోచన వద్దు. అభివృద్ధి జరిగితే మీ జీవితాలు బాగుపడతాయి" అని చంద్రబాబు వివరించారు.

  • Loading...

More Telugu News