High Court: నితీశ్ కుమార్‌కు ఎదురుదెబ్బ... 65 శాతం రిజర్వేషన్లను రద్దు చేసిన పాట్నా హైకోర్టు

Setback to Nitish Kumar as Patna HC
  • విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ అసెంబ్లీ తీర్మానం
  • రిజర్వేషన్ల పెంపుపై వివిధ వర్గాల నుంచి అభ్యంతరం
  • హైకోర్టులో పిటిషన్ల దాఖలు... నేడు రిజర్వేషన్లు రద్దు చేస్తూ తీర్పు

నితీశ్ కుమార్ ప్రభుత్వానికి పాట్నా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ నితీశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టివేసింది. ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం పేర్కొంది. 65 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ గురువారం తీర్పు వెలువరించింది.

నితీశ్ కుమార్ ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేపట్టి ఆ నివేదికను గత ఏడాది అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అదే సమయంలో విద్య, ఉద్యోగ రంగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లను పెంచుతూ సవరణ బిల్లును తీసుకువచ్చారు. ఈ బిల్లుకు శాసన సభ ఏకగ్రీవం తెలిపింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

దీంతో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అణగారిన వర్గాల రిజర్వేషన్లు 50 శాతం నుంచి 65 శాతానికి పెరిగాయి. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఉద్దేశించిన 10 శాతం రిజర్వేషన్లను కల్పితే మొత్తం 75 శాతానికి చేరుకుంటాయి. దీంతో రిజర్వేషన్ల పెంపుపై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తం అయింది. హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం ఈ ఏడాది మార్చిలో తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా, 65 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ నేడు తుది తీర్పును వెలువరించింది.

  • Loading...

More Telugu News