Harish Rao: తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయనేందుకు ఇదిగో నిదర్శనం...: హరీశ్ రావు

 Harish Rao tweet about crimes in Telangana

  • వరుసగా హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వెల్లడి
  • ఉట్కూరు, బాలాపూర్, పెద్దపల్లి, భూపాలపల్లి ఘటనలను ప్రస్తావించిన మాజీ మంత్రి
  • బీఆర్ఎస్ హయాంలో శాంతిభద్రతలకు చిరునామాగా తెలంగాణ ఉండేదన్న హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే శాంతిభద్రతలు క్షీణించాయనేందుకు నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన పలు ఘటనలను ప్రస్తావించారు.

'గడిచిన వారం రోజుల్లో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారు. హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్‌లో అందరూ చూస్తుండగా సమీర్ అనే యువకుడిని దారుణంగా పొడిచి చంపారు. పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన మరచిపోక ముందే, మరో దారుణం చేసుకుంది. రక్షించాల్సిన పోలీసే, తోటి మహిళా కానిస్టేబుల్‌ను భక్షంచే దుర్ఘటన నిన్న భూపాలపల్లి జిల్లాలో జరగడం అత్యంత హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వం తక్షణం స్పందించి కారకుడైన ఎస్సైపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నా'మని రాసుకొచ్చారు.

గత పదేళ్ళలో శాంతిభద్రతలకు చిరునామాగా మారిన తెలంగాణ రాష్ట్రంలో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో భద్రత ప్రశ్నార్థకంగా మారడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇక మీదట ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News