Kane Williamson: కేన్ విలియమ్సన్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. కెప్టెన్సీకి గుడ్‌బై!

Kane Williamson Quits Captaincy and Declines New Zealand Central Contract After T20 World Cup Debacle

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో కివీస్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌
  • వైట్‌బాల్ కెప్టెన్సీతో పాటు సెంట్ర‌ల్ కాంట్రాక్టు వ‌దులుకున్న కేన్ మామ‌
  • ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 
  • కెప్టెన్సీలో కేన్ మామ ఎన్నో ఘనతలు

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో జ‌ట్టు ఘోర ప్ర‌ద‌ర్శ‌న‌తో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్టు పగ్గాలను వదిలేసిన కేన్ మామ ఇప్పుడు వైట్ బాల్ ఫార్మాట్ కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పాడు. ఇకపై వన్డేల్లో, టీ20ల్లోనూ సారథిగా ఉండనని ప్రకటించాడు. అంతేగాక 2024-25 సీజ‌న్‌కు సంబంధించి జాతీయ కాంట్రాక్టు నుంచి కూడా అత‌ను వైదొలిగాడు. ఈ విష‌యాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు త‌న అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్ల‌డించింది.  

టీ20 వరల్డ్ కప్ లో కివీస్ ఘోర వైఫల్యమే విలియమ్సన్ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. పొట్టి కప్ చరిత్రలో తొలిసారిగా కివీస్ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. దాదాపు దశాబ్దం తర్వాత సెమీఫైనల్స్‌కు చేరలేదు. ఈ మెగాటోర్నీలో గ్రూప్-సీలో ఉన్న బ్లాక్‌క్యాప్స్ తమ తొలి మ్యాచ్‌లో ఆఫ్గనిస్థాన్ చేతిలో 84 పరుగుల ఘోర ఓట‌మిని చవిచూసింది. 

ఆ తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన పోరులో 13 పరుగుల తేడాతో ప‌రాజయంపాలైంది. అనంతరం పసికూనలు ఉగాండ, పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచుల్లో వరుసగా తొమ్మిది, ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి గ్రూప్-సీ టేబుల్‌లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. 

అయితే విలియమ్సన్ తీసుకున్న నిర్ణయాలు తనని రిటైర్మెంట్ వైపు అడుగులు వేసేలా చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. న్యూజిలాండ్ తరఫున ఆడటం గొప్ప అవకాశంగా భావిస్తుంటానని, జట్టుకు తిరిగి ఇంకా చేయాలనే కోరిక తనలో ఉందని విలియమ్సన్ చెప్పాడు.

అయితే ఇంకా ఆడతానని పరోక్షంగా ప్రకటించిన కేన్ మామ‌ క్రికెట్ ప్రపంచం అవతల పరిస్థితులు మారిపోయాయని, కుటుంబంతో సమయాన్ని గడపడం తనకి ఎంతో ముఖ్యమని చెప్పాడు. టీ20 వరల్డ్ కప్-2026లో బరిలోకి దిగుతారా అనే ప్రశ్నకు.. దానికి ఎంతో సమయం ఉందని, పరిస్థితులు ఎలా మారుతాయో చూద్దామని చెప్పాడు. అలాగే న్యూజిలాండ్ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటానని విలియమ్సన్ పేర్కొన్నాడు.

కెప్టెన్సీలో కేన్ మామ ఎన్నో ఘనతలు
తన కెప్టెన్సీలో కేన్ విలియమ్సన్ ఎన్నో ఘనతలు సాధించాడు. టెస్టు ఛాంపియన్‌షిప్-2021‌లో న్యూజిలాండ్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. 2019 వన్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌, 2021 టీ20 ప్ర‌పంచ కప్‌ల్లో కివీస్‌ను ఫైనల్ వ‌రకు తీసుకెళ్లాడు. ఇక ఇటీవల తన కెరీర్‌లో 100 టెస్టుల మైలురాయిని కేన్ మామ‌ అందుకున్నాడు. కివీస్ త‌ర‌పున దాదాపు 350 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 40 టెస్టులకు, 91 వన్డేలకు, 75 టీ20లకు సార‌థ్యం వ‌హించాడు.

  • Loading...

More Telugu News