Bhupatiraju Srinivasa Varma: కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భూపతిరాజు శ్రీనివాసవర్మ
- నరసాపురం ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన శ్రీనివాసవర్మ
- కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయమంత్రిగా నియామకం
- నేడు ఢిల్లీలో కుటుంబ సభ్యులు, బీజేపీ నేతల సమక్షంలో బాధ్యతల స్వీకరణ
- చంద్రబాబుతో సమన్వయం చేసుకుంటూ ఏపీకి పరిశ్రమలు తీసుకువస్తానని వెల్లడి
నరసాపురం లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల్లో విజయం సాధించిన భూపతిరాజు శ్రీనివాసవర్మను కేంద్ర సహాయమంత్రి పదవి వరించిన సంగతి తెలిసిందే. ఆయనను ఎన్డీయే సర్కారులో భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయమంత్రిగా నియమించారు.
ఈ నేపథ్యంలో, భూపతిరాజు శ్రీనివాసవర్మ నేడు ఢిల్లీలో కేంద్ర సహాయమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసవర్మ కుటుంబ సభ్యులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ, ప్రజల సెంటిమెంట్ ను గౌరవిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తానని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబుతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చేందుకు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన కంపెనీలతో మాట్లాడి తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.