Congress: కార్యకర్తతో బురద కాళ్లను కడిగించుకున్న కాంగ్రెస్ నేత... వీడియో వైరల్
- కాంగ్రెస్ నాయకుల ఫ్యూడల్ మనస్తత్వానికి నిదర్శనమన్న బీజేపీ నేత
- అధికారంలో లేనప్పుడే ఇలా చేస్తే... వస్తే ఎలా ఉంటారోనన్న పూనావాలా
- తనకు పబ్లిసిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ నానా పటోల్ చురక
మహారాష్ట్రలో కాంగ్రెస్ నాయకుడు నానా పటోల్ ఓ కార్యకర్తతో కాళ్లు కడిగించుకొని వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కాళ్లు కడిగించుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆయన బురద కాళ్లతో కూర్చొని ఉండగా... ఓ కార్యకర్త నానా పటోల్ కాళ్లను కడుగుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.
ఈ వీడియోపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల ఫ్యూడల్ మనస్తత్వానికి ఇది నిదర్శనమని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఓటర్లను, కార్యకర్తలను బానిసల్లా చూస్తారని ఆరోపించారు. అధికారంలో లేనప్పుడే వారు ఇలా ప్రవర్తిస్తే... అధికారంలోకి వస్తే ఎలా ఉంటారో అర్థం చేసుకోవచ్చునని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, నానా పటోల్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మోదీ అత్యున్నత స్థానంలో ఉన్నప్పటికీ తన పాదాలను ఎవరినీ తాకనీయరని... కాంగ్రెస్ నాయకులు అందుకు విరుద్ధంగా ఉన్నారని బీజేపీ నేత శాంతికుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బానిసత్వ ఆలోచన గాంధీ కుటుంబం నుంచి మొదలై పార్టీ మొత్తానికి విస్తరించిందని ఎద్దేవా చేశారు.
వీడియోపై నానా పటోల్ స్పందించారు. తాను ఓ సభకు వెళ్లినప్పుడు కాళ్లకు బురద అంటుకుందని, ఓ కార్యకర్త నీళ్లు తీసుకువచ్చారని... ఆయన నీళ్లు పోస్తుంటే తాను కాళ్లు కడుక్కున్నానని చెప్పారు. తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని... బురదలో తిరగడం తనకు కొత్త కాదన్నారు. ఇలాంటి ఆరోపణలతో తాను బాధపడటం లేదని... ఏదేమైనా తనకు పబ్లిసిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చురక అంటించారు.