Revanth Reddy: వారిపై ఉన్న ఆ కేసులను ఉపసంహరించుకోండి: తెలంగాణ సీఎంకు FFGG లేఖ

Withdraw trivial cases against politicos
  • పలువురు రాజకీయ నాయకులపై చిన్న చిన్న కేసులు ఉన్నాయన్న FFGG
  • రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కేసీఆర్‌లపై పెట్టీ కేసులు ఉన్నట్లు వెల్లడి
  • కేసులను సమీక్షించి ఉపసంహరించుకోవాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ విజ్ఞప్తి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తదితర రాజకీయ నాయకులపై ఉన్న పెట్టీ కేసులపై.. సమీక్షించి వాటిని ఉపసంహరించుకోవాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాసింది. పలువురు రాజకీయ నాయకులపై చిన్న చిన్న వాటికి కేసులు పెట్టారని పేర్కొంది. రాజకీయంగా ప్రేరేపింపబడిన కేసులను సంవత్సరాలైనా పోలీసులు దర్యాఫ్తు చేయరని పేర్కొంది. ఈ మేరకు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రధాన కార్యదర్శి పద్మనాభరెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

కేసీఆర్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి వంటి రాజకీయ నాయకులపై చిన్నచిన్న కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. వీరిపై నమోదైన కేసులను దశాబ్దమైనా విచారణ జరిపించలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్‌పై కేసులు నమోదయ్యాయని ఆ లేఖలో పేర్కొన్నారు. మిలియన్ మార్చ్ సందర్భంగా కొందరు మీడియా ప్రతినిధుల నుంచి కేసీఆర్ కెమెరాలు లాక్కున్నారని కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ అక్కడ లేకపోయినప్పటికీ ఏ2గా పేర్కొన్నారని... కానీ 12 ఏళ్లుగా ఆ కేసు విచారణ పెండింగ్‌లోనే ఉందన్నారు.

కేసీఆర్‌పై తొమ్మిది కేసులు ఉన్నాయని... ఇందులో అన్నీ ఉద్యమం సమయంలోనివే అని తెలిపారు. బండి సంజయ్‌పై 42 కేసులు ఉండగా... ఇందులో చాలావరకు చిన్న చిన్న కేసులేనని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిపై 89 కేసులు ఉండగా... రెండు మూడు కేసులు మినహాయిస్తే అన్నీ చిన్నవేనని తెలిపారు. అయితే అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని తాము కోరడం లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News