: ఆరోపణలు నిజమైతే రాజ్ కుంద్రాపై సస్పెన్షన్: రాజస్థాన్ రాయల్స్
రాజ్ కుంద్రా చట్టానికి కట్టుబడి ఉండేవ్యక్తి అని, ఒకవేళ చట్టవిరుద్దంగా వ్యవహరించినట్లు తేలితే ఆయనను సస్పెండ్ చేస్తామని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ప్రకటన జారీ చేసింది. ఫ్రాంచైజీలో ఆయనకున్న 11.7శాతం వాటాను కూడా కోల్పోతారని స్పష్టం చేసింది. వాటాదారుల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటామని తెలిపింది. రాజ్ కుంద్రాకు మైనారిటీ వాటా మాత్రమే ఉందని, ఫ్రాంచైజీ నిర్వహణలో ఆయనకు పాత్ర లేదని పేర్కొంది. నిబంధనల ప్రకారం ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమాని బెట్టింగులకు పాల్పడితే ఆ ఫ్రాంచైజీని రద్దు చేసే అధికారం బీసీసీఐకి ఉంటుంది. అంతవరకూ రానీకూడదనే ముందు జాగ్రత్తతో రాజస్థాన్ రాయల్స్ ఈ ప్రకటన జారీ చేసి ఉంటుందని భావిస్తున్నారు.