T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే వెస్టిండీస్ ఘనమైన రికార్డ్

West Indies Creates Another Record In T20 World Cup History

  • పవర్ ప్లేలో 92/1 పరుగులు చేసిన కరీబియన్ జట్టు
  • 2014లో నెదర్లాండ్స్ నెలకొల్పిన రికార్డు బద్దలు
  • సెంచరీకి రెండు పరుగుల ముందు రనౌట్ అయిన పూరన్
  • ఆఫ్ఘనిస్థాన్‌పై 104 పరుగుల తేడాతో విండీస్ విజయం

అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ అంచనాలకు మించి అలరిస్తోంది. అనామక జట్లు చరిత్ర సృష్టిస్తుంటే పాకిస్థాన్, శ్రీలంక వంటి దిగ్గజ జట్లు లీగ్ దశలోనే కాడిపడేసి నిష్క్రమించాయి. తాజాగా వెస్టిండీస్- ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగిన గ్రూప్-సి మ్యాచ్‌లో మరో రికార్డు బద్దలైంది.

టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి పవర్ ప్లేలో అత్యధిక స్కోరు నమోదైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ పవర్ ప్లేలో ఒక వికెట్ నష్టపోయి ఏకంగా 92 పరుగులు చేసింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యధికం. 2014లో ఐర్లాండ్‌పై నెదర్లాండ్స్ ఒక వికెట్ నష్టపోయి 91 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా, ఇప్పుడా రికార్డును విండీస్ చెరిపేసింది.

తాజా మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై విండీస్ 104 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నికోలస్ పూరన్ దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. బ్యాట్‌తో రెచ్చిపోయిన పూరన్ 53 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 98 పరుగులు చేసి సెంచరీకి రెండు పరుగుల ముందు రనౌట్ అయ్యాడు. చార్లెస్ 43, షాయ్ హోప్ 25, రోవ్‌మన్ పావెల్ 26 పరుగులు చేశారు.

అనంతరం 219 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్థాన్ 16.2 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో ఇబ్రహీం జద్రాన్ చేసిన 38 పరుగులే అత్యధికం. అజ్మతుల్లా ఒమర్‌జాయ్ 23, కెప్టెన్ రషీద్ ఖాన్ 18 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో ఒబెడ్ మెక్‌కాయ్ 3, అకీల్ హొసీన్, గుడకేశ్ మూతీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 98 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన పూరన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

More Telugu News