soaps Price: సబ్బులు, గోధుమ పిండి సహా నిత్యావసరాల ధరల పెంపు
- సంతూర్ సబ్బు ధర 3 శాతం, ఆశీర్వాద్ ఆటా 17 శాతం పెంపు
- ఇప్పటికే 1-5 శాతం పెంచేసిన కొన్ని సంస్థలు
- ముడి పదార్థాల వ్యయం పెరిగిందంటున్న కంపెనీలు
ఇంట్లో రోజూ వాడే సబ్బులు, నూనెలు, నూడుల్స్, గోధుమ పిండి తదితర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ధరలు పెంచగా.. మిగతా కంపెనీలు రేపో మాపో పెంచేందుకు సిద్ధమయ్యాయి. ముడి పదార్థాలు సహా ఇతరత్రా ఉత్పాదక ఖర్చులు పెరగడంతో ధరల పెంపు అనివార్యంగా మారిందని కంపెనీలు చెబుతున్నాయి.
సగటున ధరలను 1-5 శాతం పెంచేందుకు ఏర్పాట్లు చేశాయి. దీంతో మధ్యతరగతి ప్రజల నెలవారీ ఖర్చులు మరింత పెరగనున్నాయి. సబ్బులు, బాడీ వాష్‌ల ధరలు 2-9%, కేశ సంరక్షణ నూనెల ధరలు 8-11%, ఎంపిక చేసిన ఆహార పదార్థాల ధరలు 3-17% పెరుగుతున్నాయని సమాచారం.
విప్రో కంపెనీ తన సంతూర్ సబ్బుల ధరలను ఏకంగా 3 శాతం, కోల్గేట్, పామోలివ్, బాడీవాష్ ల ధరలను పెంచింది. స్వల్పకాలంలో కమొడిటీల ధరల పెరుగుదల కారణంగా ధరలను సవరించబోమని హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) ప్రకటించింది. అయితే, తన ఉత్పత్తులు డోవ్ సబ్బుల ధరను 2 శాతం, షాంపూ, చర్మ సంరక్షణ ఉత్పత్తుల ధరలను 4% వరకు, నెస్లే కాఫీ ధరలను 8-13%, మ్యాగీ ఓట్స్ నూడుల్స్ ధరలను ఏకంగా 17% పెంచింది.
ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ అండ్ హెల్త్‌కేర్, జ్యోతి ల్యాబ్స్ తమ డిటర్జెంట్ల ధరలను 1-10% పెంచాయి. టాటా కన్జూమర్, డాబర్ ఇండియా, ఇమామీ సంస్థలు ఈ ఏడాది తమ ఉత్పత్తుల ధరలను 1-5% మధ్య పెంచుతామని ప్రకటించాయి. గోద్రేజ్ కన్జూమర్ ప్రోడక్ట్స్ సబ్బుల ధరను 4-5% పెంచింది. ఐటీసీ ఆశీర్వాద్ హోల్ వీట్ (గోధుమ పిండి) ధరలను 1-5% పెంచింది.